శ్రీలంక క్రికెట్ జట్టు నూతన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు పాకిస్థాన్ మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్. ఈ ఏడాది ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శన కారణంగా.. ఆ జట్టు ప్రధాన కోచ్ చండికా హతురుసింఘెను తప్పించింది లంక బోర్డు. ఆ తర్వాత ఆగస్టు 14 నుంచి న్యూజిలాండ్‌తో సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా లంక మాజీ బౌలర్ రమేశ్ రత్ననాయకేకు బాధ్యతలు అప్పగించింది. తాజాగా పూర్తిస్థాయి కోచ్‌గా ఆర్థర్ గురువారం నియమితులయ్యాడు. రెండేళ్లపాటు జట్టుకు సేవలందించనున్నాడు.
ఆర్థర్‌తో పాటు జింబాబ్వే ఆటగాడు గ్రాంట్ ఫ్లవర్‌ను బ్యాటింగ్ కోచ్‌గా, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ సకేర్‌ను బౌలింగ్ కోచ్‌గా, షేన్ మెక్‌డెర్మట్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. ఆర్థర్ గతంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు.
తొలి మ్యాచ్ దాయాదిపైనే...
కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆర్థర్‌కు ఆరంభంలోనే కఠిన సవాల్ ఎదురుకానుంది. ఏ జట్టు నుంచి కోచ్‌గా వైదొలిగాడో అదే జట్టుతో పోటీకి తన బృందంతో వెళ్తున్నాడు. పాకిస్థాన్‌తో రెండు టెస్టులకు లంక జట్టు త్వరలో పాక్‌కు పయనం కానుంది. డిసెంబరు 11-15 తేదీల్లో రావల్పిండి వేదికగా తొలి టెస్టు, అదే నెల 19-23 తేదీల్లో కరాచిలో రెండో టెస్టు ఆడనున్నాయి ఇరుజట్లు.
శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లను తన సొంతగడ్డపై విజయవంతంగా నిర్వహించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. ఆ జట్టుతో టెస్టు సిరీస్‌ను కూడా స్వదేశంలోనే నిర్వహించే దిశగా లంక బోర్డును ఒప్పించింది. ముందు పాకిస్థాన్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ మాత్రమే ఆడేందుకు అంగీకరించిన లంక.. టెస్టుల్ని మాత్రం యూఏఈలో నిర్వహించాలని షరతు విధించింది. అయితే వన్డే, టీ20 సిరీస్‌లను పటిష్ఠ భద్రత మధ్య ఏ ఇబ్బందులూ రాకుండా నిర్వహించాక కూడా యూఏఈలోనే టెస్టులు ఆడాలని లంక పట్టుబట్టడాన్ని పీసీబీ తప్పుబట్టింది. యూఏఈలో ఆడాలంటే ఆతిథ్య ఖర్చుల్లో సగం భరించాలని మెలిక పెట్టింది. ఈ విషయమై చర్చల అనంతరం టెస్టు సిరీస్ కూడా పాక్‌లోనే ఆడేందుకు లంక అంగీకరించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">