మైదానంలో ప్రేక్షకులు హోరు, కేరింతలు లేకపోతే క్రికెటర్లలో మునుపటిలా ఆడాలనే కసి కనిపించదని అభిప్రాయపడ్డాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న దృష్ట్యా, ఖాళీ స్డేడియంలో మ్యాచ్‌లు నిర్వహించాలని పలు దేశాల క్రికెట్ బోర్డులు యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విరాట్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో ప్రేక్షకులుంటే ఆ సరదా వేరు. వారి వల్లే ఆటగాళ్లలో మరింత ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు కరోనా ప్రభావం వల్ల వారు లేకుండానే మ్యాచ్‌లను నిర్వహించాలని భావిస్తున్నారు. దీని వల్ల ఆటగాళ్లలో మునుపటిలా కసి కనిపించకపోవచ్చు. అభిమానులు లేకపోతే ఆటలో ఉంటే మ్యాజిక్‌ను సృష్టించడం చాలా కష్టం"
-కోహ్లీ, టీమిండియా సారథి
ఖాళీ స్డేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించే విషయమై క్రికెటర్లలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జేసన్ రాయ్, జాస్ బట్లర్, ప్యాట్ కమిన్స్ వంటి వారు దీనికి మద్దతు పలుకుతుండగా.. మ్యాక్స్‌వెల్, దిగ్గజ క్రికెటర్ అలెన్ బోర్డర్ వంటి వారు దీనిని విబేధిస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరగాలి. ఇప్పుడు ఈ టోర్నీని ఖాళీ స్టేడియాల్లో నిర్వహించేందుకు ఆసీస్ క్రికెట్ బోర్డు సమాలోచనలు జరుపుతోంది.
ఇదీ చూడండి : 'సచిన్ కంటే రోహిత్‌శర్మ బెస్ట్ ఓపెనర్'