ఐపీఎల్ 14వ సీజన్ సమరభేరీ మోగింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్, స్టార్లతో కళకళలాడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి పోరుకు సిద్ధమయ్యాయి. రెండు జట్ల సారథులు టీమ్‌ఇండియాకు రెండు కళ్లలాంటి వారు. దీంతో మ్యాచ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. 27 మ్యాచుల్లో 17 విజయాలతో ముంబయిదే పైచేయి. అయినా కోహ్లీసేనను తక్కువ చేయలేం. ఈ రెండు జట్లు తలపడ్డ ఆఖరి ఐదు మ్యాచుల్లో పోరు హోరాహోరీగానే సాగింది మరి!
సూర్య.. ఆకాశమే హద్దుగా
ఈ రెండు జట్లు చివరగా అబుదాబి వేదికగా 2020, అక్టోబర్ 28న తలపడ్డాయి. దేవదత్ పడిక్కల్ (74; 45 బంతుల్లో 12×4, 1×6) చిచ్చరపిడుగులా చెలరేగి ఆడాడు. మొదట బెంగళూరు 164/6తో నిలిచింది. అతడికి మరెవ్వరూ అండగా నిలవలేదు. దీంతో భారీ స్కోరు చేయలేదు ఆర్సీబీ. లక్ష్య ఛేదనలో ముంబయి తడబడింది. డికాక్ (18), కిషన్ (25) త్వరగా ఔటయ్యారు. మిడిలార్డర్లోనూ పాండ్య సోదరులు త్వరగా పెవిలియన్ చేరారు. కానీ మూడో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ (79*; 43 బంతుల్లో 10×4, 3×6) ఆకాశమే హద్దుగా బాదేశాడు. అజేయంగా నిలిచి 5 వికెట్ల తేడాతో విజయం అందించాడు.
సూపర్ 'ఇషాన్'
గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన తొలిపోరులో మాత్రం బెంగళూరుదే విజయం. రెండు జట్ల స్కోర్లు సమమైంది. దీంతో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. పడిక్కల్ (54), ఫించ్ (52), డివిలియర్స్ (55*; 24 బంతుల్లో 4×4, 4×6) అర్ధశతకాలకు తోడుగా శివమ్ దూబె (27*; 10 బంతుల్లో 1×4, 3×6) మెరుపులతో కోహ్లీసేన తొలుత 201 పరుగులు చేసింది. ఛేదనలో రోహిత్ (8), డికాక్ (14), సూర్య (0), హార్దిక్ (15) విఫలమయ్యారు. ఈ తరుణంలో ఇషాన్ కిషన్ (99; 58 బంతుల్లో 2×4, 9×6) విధ్వంసానికి పొలార్డ్ (60*; 24 బంతుల్లో 3×4, 5×6) తోడయ్యాడు. దీంతో స్కోరును ముంబయి సమం చేసింది. కానీ సూపర్‌ఓవర్లో హార్దిక్, పొలార్డ్ 7 పరుగులే చేయడం వల్ల కోహ్లీ, ఏబీ చెరో బౌండరీ బాది విజయాన్ని అందించారు.
'డెవిల్' ఈజ్ బ్యాక్
2019 సీజన్లో రెండు మ్యాచుల్లోనూ ముంబయిదే జయభేరీ. ఏప్రిల్ 17న వాంఖడేలో జరిగిన పోరులో మొదట బెంగళూరు 171/7 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (75; 51 బంతుల్లో 6×4, 4×6), మొయిన్ అలీ (50; 32 బంతుల్లో 1×4, 5×6) అర్ధశతకాలు బాదేశారు. ఏబీ ధాటికి అభిమానులు అతడిని వీడ్కోలు నుంచి తిరిగొచ్చేయాలని కోరారు. ఈ పోరులో ముంబయి ఆఖరి బంతికి గెలుపొందింది. డికాక్ (40), సూర్య (29), రోహిత్ (28), ఇషాన్ (21), హార్దిక్ (37*) సమష్టిగా ఆడారు. 5 వికెట్ల తేడాతో జట్టును గెలిపించారు.
ఏబీ.. చెలరేగినా!
చిన్నస్వామి వేదికగా మార్చి 28న తలపడ్డ పోరులో మొదట ముంబయి 8 వికెట్ల నష్టానికి 187 స్కోర్ చేసింది. రోహిత్ (48), సూర్య (38), హార్దిక్ (32*) రాణించారు. హార్దిక్ సిక్సర్లు బాదకుంటే ఓటమి పాలయ్యేవారే. ఛేదనలో కోహ్లీ (46) ఫర్వాలేదనిపించాడు. ఇక ఏబీ డివిలియర్స్ (70*) సిక్సర్ల వర్షం కురిపించాడు. అయితే అతడికి మరెవ్వరి నుంచీ అండ దొరకలేదు. 12 బంతుల్లో 22 చేయాల్సిన క్రమంలో 19వ ఓవర్లో బుమ్రా కేవలం 5 పరుగులిచ్చి వికెట్ తీశాడు. ఆఖరి ఓవర్లో మలింగ సైతం 10 పరుగులే ఇవ్వడం వల్ల బెంగళూరు 6 పరుగుల తేడాతో ఓడింది.
పేసర్ల.. చలవతో
2018, మే1న ఈ రెండు జట్లు చిన్నస్వామి వేదికగా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. మనన్ వోహ్రా (45), మెక్‌కలమ్ (37), కోహ్లీ (32) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో ముంబయికి కలిసిరాలేదు. తమ పేస్‌తో టిమ్ సౌథీ (2), ఉమేశ్ యాదవ్ (2), సిరాజ్ (2) చెలరేగారు. సూర్య (9), ఇషాన్ (0), రోహిత్ (0)ను 21 పరుగుల్లోపే పెవిలియన్ పంపించారు. డుమిని (23), పొలార్డ్ (13) సైతం ఎక్కువసేపు నిలవలేదు. ఈ క్రమంలో సోదరుడు క్రునాల్ (23)తో కలిసి హార్దిక్ (50) అర్ధశతకం సాధించాడు. కీలక సమయంలో అతడూ ఔటయ్యాడు. దీంతో ముంబయి 153/7కు పరిమితమైంది.
ఇదీ చదవండి: ఐపీఎల్ 2021: బరిలో దిగితే రికార్డులే!