బాల్ ట్యాంపరింగ్‌తో ఏడాది నిషేధం.. అన్నివైపుల నుంచి విమర్శలు.. మోసగాళ్లు అంటూ ఛీత్కారాలు.. అయినా ఓర్చుకున్నారు.. మళ్లీ జట్టులో పునరాగమనం చేశారు. ఐపీఎల్, ప్రపంచకప్, యాషెస్.. టోర్నీ ఏదైనా వారి ముందు దిగదుడుపే.. బౌలర్లకు పరీక్షే.. బంతి బౌండరీ దాటాల్సిందే ఆ రకంగా జైత్రయాత్ర కొనసాగించారు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్.
గత ఏడాది ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ సందర్భంగా... ఆసీస్ క్రికెటర్ కేమరూన్ బాన్‌క్రాఫ్ట్ జేబులో ఏదో ఉన్నట్లు కెమెరాల్లో చిక్కింది. చివరికి అది శాండ్ పేపర్ అని, బంతిని ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించాడని తేలింది. ఫలితంగా అతడితో పాటు కెప్టెన్, వైస్ కెప్టెన్ అయిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పైన ఏడాది పాటు నిషేధం పడింది. వీరి కెరీర్లు ముగిసినట్లే అని అందరూ భావించారు

కాలం గిర్రున తిరిగింది.. ఈ ఏడాదిలో ఆసీస్ ప్రదర్శన ఏ మాత్రం బాగలేదు. సొంతగడ్డపై భారత్‌తో టెస్టు సిరీస్ ఓడిపోయి అప్రతిష్ఠ మూటగట్టుకుంది. వార్నర్, స్మిత్ లేకపోతే జట్టు పరిస్థితి ఇంతే అన్నట్లు మారిపోయింది. కెనడా గ్లోబల్ టీ-20 లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఆడిన వీరిద్దరూ గాయాల బారిన పడ్డారు. అయితే త్వరగా కోలుకుని ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చారు.
ఐపీఎల్లో వార్నర్ విధ్వంసం.. స్మిత్ శుభారంభం..
ఏడాది తర్వాత బ్యాట్ పట్టిన వీరిద్దరూ ఐపీఎల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ప్రపంచకప్ నేపథ్యంలో చెరో 12 మ్యాచ్‌లు ఆడారు. సన్‌రైజర్స్ తరపున డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించాడు. 70 సగటుతో 692 పరుగులతో ఐపీఎల్లో అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో నిలిచిన కేఎల్ రాహుల్ - వార్నర్‌కు మధ్య 100 పరుగుల తేడా ఉందంటే అతడి విధ్వంసం ఎలా కొనసాగిందో అర్ధం చేసుకోవచ్చు.

ఐపీఎల్-2019 ఆరంభంలో తడబడిన స్టీవ్ స్మిత్.. అనంతరం సత్తాచాటాడు. 12 మ్యాచ్‌ల్లో 116 స్ట్రైక్‌రేట్‌తో 275 పరుగులు చేశాడు. టోర్నీ మధ్యలో అజింక్యా రహానే స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకుని మరింత బాధ్యతాయుతంగా ఆడాడు స్మిత్.
ఆసీస్‌ను ప్రపంచకప్‌లో రేసులో...
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను మళ్లీ రేసులో తెచ్చారు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్. ఈ టోర్నీలో డేవిడ్ వార్నర్ రెచ్చిపోయాడు. మూడు శతకాలు, మూడు అర్ధ సెంచరీలతో విజృంభించాడు 70 సగటు 90 స్ట్రైక్ రేట్‌తో 647 పరుగులు చేశాడు. మెగాటోర్నీలో అత్యధిక పరుగుల చేసిన వారిలో వార్నర్ రెండో స్థానంలో నిలిచాడు. నిదానంగా ఆడాడని విమర్శలు వచ్చినప్పటికీ ఫించ్‌తో కలిసి 1154 పరుగులు జోడించి జట్టును సెమీస్ తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు.

స్టీవ్ స్మిత్ 10 మ్యాచ్‌లో 379 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడాడు. ఇందులో నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. ముఖ్యంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అలెక్స కేరీతో కలిసి వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అప్పటికే 147కే ఆరు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉంది. నిలకడైన ఆటతీరుతో ఆసీస్‌ను గెలిపించాడు.
యాషెస్‌లో వార్నర్ విఫలం.. స్మిత్ వీరోచితం..
ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్‌లో ఓపెనర్ వార్నర్ ఘోరంగా విఫలమయ్యాడు. అయితే స్మిత్ మాత్రం వీరోచిత ఇన్నింగ్స్‌తో చాలాసార్లు ఆసీస్‌ను ఆదుకున్నాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 110.57 సగటుతో 774 పరుగులు చేశాడు స్మిత్. ఇందులో మూడు శతకాలు(144, 142, 211), మూడు అర్ధశతకాలు (92,82,80) ఉన్నాయి. భారత్‌పై 2014-15 సీజన్లో తాను చేసిన 769 పరుగుల రికార్డును తానే తిరగరాశాడు.

మొత్తంగా చూసుకుంటే ఓ యాషెస్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఆఖరి ఇన్నింగ్స్‌లో తప్ప ప్రతి ఇన్నింగ్స్‌లోనూ కనీసం 50 పరుగులు చేశాడు స్మిత్. ఈ మిలీనియంలో ఓ టెస్టు సిరీస్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు.
అవమానించిన చోటే.. అభినందనలు
ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్, యాషెస్ సిరీస్‌లో స్మిత్ బ్యాటింగ్‌కు దిగుతున్నపుడు చీటర్ అంటూ ఇంగ్లీష్ అభిమానులు ఎగతాళి చేసినా పట్టించుకోలేదు స్మిత్. తన ఆటతీరుతో అందరి నోళ్లు మూయించాడు. ఇప్పుడు అందరి గౌరవం అందుకున్నాడు. ఆఖరి టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో అతడు ఔటై వెళ్లి పోతుంటే అందరూ లేచి చప్పట్లు కొట్టి మరి అభినందించారు.
ప్రస్తుతం జరిగిన యాషెస్ సిరీస్ చివరి టెస్టులో 363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 263 పరుగులకే కుప్పకూలింది. 2-2 తేడాతో సిరీస్ డ్రాగా ముగిసింది.