పాకిస్థాన్ మాజీ స్పిన్ దిగ్గజం సక్లైన్ ముస్తాక్.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీపై ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా అతడు జాతీయ జట్టును సమర్ధమంతగా నడిపించాడని, ప్రస్తుత బాధ్యతనూ అదే విధంగా నిర్వర్తిస్తాడని నమ్మకం వ్యక్తం చేశాడు.
"సౌరభ్ గంగూలీపై ప్రస్తుతం పెద్ద బాధ్యత ఉంది. ఓ మంచి ఆటగాడిగా ఎలా పేరు తెచ్చుకున్నాడో, దేశం కోసం తన కొత్త పనిని అలానే చేస్తాడని అనుకుంటున్నాను. టీమిండియాకు నువ్వో అత్యుత్తమ కెప్టెన్‌వి. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడివి. ఈ పదవిని సరిగా నిర్వర్తించి, భారత క్రికెట్‌ను సుదూరాలకు తీసుకెళ్తావని నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్" -సక్లైన్ ముస్తాక్, పాక్ మాజీ స్పిన్నర్
ముస్తాక్.. గంగూలీతో గతంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. అతడితో ఓసారి 40 నిమిషాలు మాట్లాడానని, అప్పటితో దాదాపై తనకున్న ఆలోచనా విధానం మారిందని అన్నాడు. అంతకు ముందు అతడిపై తనకున్న అభిప్రాయం గురించి క్షమాపణలు తెలిపాడు.
"నా సర్జరీ జరిగిన తర్వాత ససెక్స్ తరఫున పునరాగమనం చేశాను. ఆ మ్యాచ్ చూసేందుకు సౌరభ్ వచ్చాడు. మేం బ్యాటింగ్ చేస్తుండగా మమ్మల్ని చూశాడు. కానీ నేను అతడిని గమనించలేదు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి, నన్ను పరామర్శించాడు గంగూలీ. కాఫీ ఇచ్చి.. నా మోకాలి గాయం, సర్జరీ, కుటుంబం తదితర విషయాల గురించి అడిగాడు. అప్పుడు మేం దాదాపు 40 నిమిషాలు మాట్లాడం. చివరికి అతడు నా మనసు గెల్చుకున్నాడు" -సక్లైన్ ముస్తాక్, పాక్ మాజీ స్పిన్నర్
ముస్తాక్.. భారత్‌పై 2004లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. పాక్ తరఫున వన్డేల్లో వేగంగా 100, 150, 200, 250 వికెట్లు ఘనత ఇప్పటికీ ఇతడి పేరిటే ఉంది.