ప్రస్తుతం క్రికెట్లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మూడు ఫార్మాట్లలోనూ సత్తాచాటుతూ ఒకరికొకరు దీటుగా రాణిస్తున్నారు. కోహ్లీ వన్డేల్లో టాప్లో కొనసాగుతుండగా. స్మిత్ టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్నాడు. తాజాగా విరాట్ గురించి స్పందించిన స్మిత్.. అతడో గొప్ప ఆటగాడని కితాబిచ్చాడు.
"విరాట్ కోహ్లీ ఓ అద్భుత ఆటగాడు. అతడి రికార్డులు అసాధారణం. భారత క్రికెట్ కోసం అతడు చాలా చేశాడు. తనను తాను ఎప్పుడూ మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఫిట్నెస్ పరంగానూ అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. నేను అతడి గురించి ఒక్క మాట కూడా చెడుగా చెప్పలేను. అతడో అమేజింగ్ క్రికెటర్."
-స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా క్రికెటర్
ముఖ్యంగా కోహ్లీకి వన్డేల్లో మంచి రికార్డుందని తెలిపాడు స్మిత్. ఛేదనలో అతడి రికార్డు చూస్తే ఆశ్చర్యపోకతప్పదని అన్నాడు. ఎంత ఒత్తిడిలో ఉన్నా ప్రశాంతగా తన పని తాను చేసుకుపోతాడని పేర్కొన్నాడు.