సఫారీ జట్టుతో వచ్చే నెల 2 నుంచి ప్రారంభంకానున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు జట్టును ప్రకటించింది సెలక్షన్ కమిటీ. ఇటీవల విండీస్ పర్యటనలో పేలవ ప్రదర్శనతో నిరాశపర్చిన కేఎల్ రాహుల్‌కు చోటు లభించలేదు. రోహిత్‌శర్మకు సుదీర్ఘ ఫార్మాట్లోనూ ఓపెనింగ్ బాధ్యతలు అప్పగించింది. 15 మందితో కూడిన జట్టులో యువ ఆటగాడు శుభ్‌మన్‌గిల్ చోటు సంపాదించాడు.
20 ఏళ్ల ఈ ఆటగాడు టెస్టు జట్టులో అరంగేట్రం చేయనున్నాడు. అతడి గురించి కొన్ని విషయాలు చూద్దాం.
- కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన శుభ్‌మన్.. ఆఫ్‌స్పిన్ వేయగలడు.
- ఇటీవల దక్షిణాఫ్రికా-ఏ జట్టుపై అన్ని ఫార్మాట్లలో రాణించాడీ యువతేజం. అందుకే సొంతగడ్డపై సఫారీలతో జరగనున్న టెస్టు సిరీస్‌కు అరంగేట్రం చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మరి ఓపెనర్‌గా రాణించే సత్తా ఉన్న ఇతడిని ఏ స్థానంలో దింపుతారో చూడాలి.
- 2019 జనవరి 31న తొలిసారి వన్డేల్లో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు.
- ఇప్పటివరకు 2 వన్డేలు ఆడి 16 పరుగులు చేశాడు. 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 1,333 పరుగులు సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 49 మ్యాచ్‌ల్లో 2009 రన్స్ చేశాడు. 32 టీ20ల్లో 614 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు.
- ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 268, లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 123*, ఐపీఎల్లో 76 వ్యక్తిగత అత్యధికం.
ఐపీఎల్‌తోనే పేరు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడాడు గిల్. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో శుభ్‌మన్‌ను కోల్‌కతా యాజమాన్యం రూ. 1.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంటు' అవార్డు సొంతం చేసుకున్నాడు.
అండర్-19 ప్రపంచకప్...
2018లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు ఇతడి సారథ్యంలోనే విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో నంబర్-3 స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శుభ్‌మన్... 104.50 సగటుతో 418 పరుగులు చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తరహాలోనే 2013-14, 2014-15లలో రెండు సార్లు బీసీసీఐ బెస్ట్ జూనియర్ క్రికెట్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.
ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ...
ఆగస్టులో వెస్టిండీస్-ఏ జట్టుతో జరిగిన మూడో అనధికారిక టెస్టులో... డబుల్ సెంచరీ చేశాడు. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. 250 బంతుల్లో 204 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 19 ఏళ్ల 334 రోజుల వయసున్న ఈ యువ క్రికెటర్... భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(218) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఆగస్టులో జరిగిన 2019-20 దులీప్ ట్రోపీ గెలిచిన ఇండియా బ్లూ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు గిల్.
ఇదీ చదవండి...