టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఓసారి తనను స్లెడ్జింగ్ చేశాడని యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తమ ఆటగాళ్లతో ట్విట్టర్లో ముచ్చటించింది. ఈ సందర్భంగా.. ఒక బ్యాట్స్‌మన్‌గా ఎదురైన సరదా స్లెడ్జింగ్ ఘటనను చెప్పాలని శుభ్‌మన్‌ను కోరింది ఫ్రాంచైజీ.
"రంజీ ట్రోపీలో భాగంగా బరోడాతో మ్యాచ్ ఆడుతుండగా పాండ్య బౌలింగ్ చేస్తూ నన్ను స్లెడ్జింగ్ చేశాడు. అలా ఎందుకు చేశాడో నాకు తెలియదు. అతడు బౌలింగ్ చేస్తుంటే నేను ధాటిగా ఆడాలని చూశా. ఒక బంతి నేరుగా ఫీల్డర్ దగ్గరికి వెళ్లింది. దాంతో అతడు నన్ను రెచ్చగొట్టడం మొదలెట్టాడు. 'రా.. నా బంతులు ఎదుర్కో.. ఇది అండర్ 19 క్రికెట్ కాదు.. వచ్చి ఆడు' అని పదేపదే అన్నాడు" అని గిల్ గుర్తుచేసుకున్నాడు.
గిల్ 2018 అండర్-19 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో అత్యధిక పరుగులు(372) చేయడం వల్ల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గానూ నిలిచాడు. దీంతో గతేడాది అతడికి టీమ్‌ఇండియాకు ఆడే అవకాశం వచ్చింది. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికై ఒక మ్యాచ్ ఆడాడు. తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైనా ఆడే అవకాశం దక్కలేదు.
ఇది చూడండి : 'ఆ నిషేధం.. నా ఆలోచన విధానాన్నే మార్చేసింది'