టీమ్‌ఇండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ లాంకాషైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2021 రాయల్ లండన్ కప్ టోర్నీలో పాల్గొననున్నాడు. ఈ మేరకు లాంకాషైర్ ట్వీట్ చేసింది. భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో 2021 రాయల్ లండన్ కప్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది.
ఇప్పటి వరకు టీమ్‌ఇండియా తరఫున శ్రేయస్ 21 వన్డేలు, 29 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు. శ్రేయస్ జులై 15న ఓల్డ్ ట్రాఫోర్డ్‌కు చేరుకొని నెల రోజుల వరకు అక్కడే ఉంటాడు.
"ఇంగ్లీష్ క్రికెట్లో లాంకాషైర్‌కు ఎంతో పేరుంది. భారత క్రికెట్‌తో దానికి సుదీర్ఘ అనుబంధం ఉంది. ఫరూక్ ఇంజినీర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ వారసత్వాన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆనందంగా ఉంది. ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ ప్రపంచ స్థాయి స్టేడియం. నా జట్టు సభ్యులను అక్కడ కలుసుకొనేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నా"
- శ్రేయస్ అయ్యర్, టీమ్‌ఇండియా క్రికెటర్
"ది హండ్రెడ్ వల్ల ఈ ఏడాది రాయల్ లండన్ కప్‌లో మేం యువకులతో బరిలోకి దిగుతామన్న అంచనాలు ఉన్నాయి. టోర్నీలో మేం రాణించేందుకు టాప్ ఆర్డర్లో ఆడగల అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ మాకు అవసరం. శ్రేయస్‌కు ఐపీఎల్‌లో దిల్లీకి సారథ్యం వహించిన అనుభవం ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో అదరగొట్టాడు. ఒత్తిడి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండగలిగే అతడి నైపుణ్యాలు మా యువ జట్టుకు ఎంతో అవసరం. ప్రస్తుతం ఇంగ్లాండ్‌పై అతడి ఫామ్ ఆకట్టుకుంటోంది" అని లాంకాషైర్ క్రికెట్ డైరెక్టర్ పాల్ అలాట్ అన్నాడు. 1968 నుంచి లాంకాషైర్‌తో భారతీయులకు అనుబంధం ఉంది.
ఇదీ చూడండి: 'సూర్య ఇలాగే ఆడితే నేను ఏ స్థానానికైనా రెడీ'