నాలుగో స్థానం.. టీమిండియాను ఎప్పటినుంచో వేధిస్తున్న సమస్య. అయితే ఈ సమస్యకు పరిష్కారం చెప్పాడు భారత జట్టు ప్రధాన సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. టీమిండియా వర్ధమాన ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఈ స్థానానికి కచ్చితంగా సరిపోతాడని అభిప్రాయపడ్డాడు.
"18 నెలలు వెనక్కి వెళ్తే.. వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చాం. అతడి స్థానంలో జట్టులోకి శ్రేయస్ అయ్యర్‌ను తీసుకున్నాం. అయితే దురదృష్టవశాత్తు అతడిని కొనసాగించలేకపోయాం. శ్రేయస్ మంచి ప్రతిభ గల ఆటగాడు. పరిమిత ఓవర్ల క్రికెట్(వన్డే, టీ20) నాలుగో స్థానంలో కచ్చితమైన బ్యాట్స్‌మన్." - ఎమ్మెస్కే ప్రసాద్, టీమిండియా ప్రధాన సెలక్టర్.
ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ పదవీ కాలం త్వరలో ముగియనుంది. 2016లో చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు ప్రసాద్.
శ్రేయస్ అయ్యర్ నవంబరు 2017లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తోనే తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేశాడు. అనంతరం శ్రీలంకతో సిరీస్‌లో శతకం, వరుసగా రెండు అర్ధశతకాలతో రాణించాడు.
ఇదీ చదవండి: రికార్డు: బాహుబలి ఖాతాలో 10 వికెట్లు