పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో అతడ్ని 12వ స్థానానికి సరిపెట్టారు. ఓల్డ్ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు.. ఆటగాళ్ల పాదరక్షలు మోస్తూ కనిపించాడీ సర్ఫరాజ్. పానీయాలు కూడా మోస్తూ కనిపించాడు.
ఈ విషయమై పాక్ మాజీ క్రికెటర్ షాహిబ్ అక్తర్, యాజమాన్యంపై మండిపడ్డాడు. సర్ఫరాజ్ లాంటి ప్రముఖ ఆటగాడితో ఇలాంటి పనులు చేయించడం అవమానకరమని పేర్కొన్నాడు. పాక్ జట్టును ముందుండి నడిపిన సర్ఫరాజ్, ఇప్పుడు నిశబ్దంగా బలహీనమైన వ్యక్తిగా మారిపోయారని అన్నాడు.
ఆ దృశ్యాలు నాకు నచ్చలేదు. ఇది చాలా తప్పు. పాకిస్థాన్ జట్టుకు నాయకత్వం వహించి.. ఛాంపియన్ ట్రోఫీని తెచ్చిపెట్టిన ఓ ఆటగాడితో ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. మీరు అతనితో బూట్లు మోయించారు. ఒకవేళ తనకై తనే ఈ పని చేసిఉంటే.. ఇకపై చేయనివ్వద్దు. ఈ దృశ్యాలు చూస్తుంటే.. సర్ఫరాజ్ బలహీనమైన వ్యక్తిగా మారినట్లు అనిపిస్తోంది. అతను బూట్లు మోసినందుకు నాకెలాంటి సమస్యలేదు. కానీ, మాజీ కెప్టెన్ అలా చేయలేడు.
షాహిబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్
ఈ ఘటనపై పాక్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ కూడా స్పందించాడు. సర్ఫరాజ్ ఎంతో గొప్ప వ్యక్తి అని.. యాజమాన్యం అతడితో ఈ విధమైన పనులు చేయించడం తగదని పేర్కొన్నాడు. "ఆమిర్, వాహబ్ లాంటి సీనియర్ క్రికెటర్లు కిట్లు ధరించకుండా.. ట్రాక్ సూట్లు ధరిస్తున్నారు. ఇది కాదు టీమ్ స్ఫూర్తి అంటే. ఇక్కడే తెలుస్తోంది సర్ఫరాజ్ గొప్పతనం ఏంటో.. అతడికి ఆట పట్ల చాలా మక్కువ ఉంది. ఇటువంటివి మళ్లీ జరగకుండా చూడాలి" అని రషీద్ పేర్కొన్నాడు.