ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి వల్ల కఠిన పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో క్రికెట్ సిరీస్‌లన్నీ రద్దయ్యాయి. అయితే తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఓ ఆసక్తికర అంశాన్ని లేవనెత్తాడు. కరోనా బాధితులకు అండగా విరాళాలు సేకరించేందుకు భారత్-పాకిస్థాన్ మధ్య సిరీస్ నిర్వహించాలని సూచించాడు.
"ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేను భారత్-పాక్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ నిర్వహించాలని కోరుతున్నా. ఈ సిరీస్ వల్ల ఎవరూ బాధపడరు. కోహ్లీ సెంచరీ కొడితే పాక్ అభిమానులు సంతోషిస్తారు. బాబర్ ఆజామ్ శతకం సాధిస్తే భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తారు. మైదానంలో ఏం జరిగినా రెండు దేశాలు గెలుస్తాయి. మ్యాచ్‌లకు వీక్షణలు కూడా రికార్డు స్థాయిలో వస్తాయి. ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చిన మొత్తాన్ని రెండు దేశాలు పంచుకోవాలి. కరోనాపై పోరుకు ఇవి ఉపయోగపడతాయి."
-షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్
ప్రస్తుతం పరిస్థితులు బాగా లేవన్నాడు అక్తర్. కరోనా ప్రభావం తగ్గాక తటస్థ వేదికగా మ్యాచ్‌లు నిర్వహించాలని సూచించాడు. ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలన్నాడు.