టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్‌పై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నోరుపారేసుకున్నాడు. ఆ దేశ పాత్రికేయుడు సజ్ సాదిఖ్ శనివారం రాత్రి ఓ ట్వీట్ చేస్తూ.. గతంలో ఓ సారి సెహ్వాగ్, అక్తర్ స్లెడ్జింగ్ చేసుకున్నారని గుర్తుచేశాడు. అప్పుడు సెహ్వాగ్.. సచిన్‌కు సంబంధించి అక్తర్‌తో "తండ్రి.. తండ్రే.. కొడుకు.. కొడుకే" అన్నాడని చెప్పాడు. ఆ విషయంపై స్పందించిన అక్తర్.. "సెహ్వాగ్ నాతో అలాంటి మాటలంటే బతుకుతాడా?అతడిని నేను వదిలేసేవాడినా?అక్కడే మైదానంలో కొట్టేవాడిని, తర్వాత హోటల్లో కూడా ఘర్షణ పడేవాళ్లం" అని అన్నట్లు సాదిఖ్ తన ట్వీట్లో వెల్లడించాడు.
కాగా, గతంలో సెహ్వాగ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఒక మ్యాచ్ సందర్భంగా అక్తర్ తనను తొలుత కవ్వించాడని, అతడు బౌన్సర్లు వేస్తూ హుక్‌షాట్ ఆడమని రెచ్చగొట్టాడని చెప్పాడు. అప్పుడు తాను కూడా "అవతలి ఎండ్‌లో నీ బాబు(సచిన్) ఉన్నాడు. వెళ్లి అతడిని అడుగు. హుక్‌షాట్ కొట్టి చూపిస్తాడు" అని చెప్పినట్లు వివరించాడు. తర్వాత సచిన్ నిజంగానే అతడి బౌలింగ్‌లో హుక్‌షాట్‌లో సిక్స్ కొట్టడం వల్ల మళ్లీ అక్తర్‌తో ‘తండ్రి తండ్రే, కొడుకు కొడుకే’ అన్నానని సెహ్వాగ్ చెప్పాడు. ఇదే విషయాన్ని సాదిఖ్.. అక్తర్‌తో ప్రస్తావించగా పై విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.