ఆస్ట్రేలియా గడ్డపై షార్ట్ పిచ్ బంతులతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఇబ్బందులు పడినా. తర్వాత వాటిని అర్థం చేసుకొని ఆ బంతులను ఎదుర్కొన్నాడని దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ షాన్ పొలాక్ అన్నాడు. సచిన్.. వన్డేల్లో 18 వేల పరుగులతో, టెస్టుల్లో దాదాపు 16 వేల పరుగులతో అత్యుత్తమ క్రికెటర్‌గా ఘనత వహించాడు. అతడు ఎందుకంత గొప్ప ఆటగాడు అయ్యాడనే విషయాన్ని పొలాక్ తాజాగా వివరించాడు. ఆస్ట్రేలియా మైదానాల్లో షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవటానికి చాలా కష్టతరంగా ఉంటుందని.. కానీ అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సచిన్ వాటిని ఎదుర్కొన్నాడని తెలిపాడు.
"ఆస్ట్రేలియా పిచ్‌ల గురించి సచిన్ ఒకసారి నాతో చర్చించాడు. షార్ట్‌పిచ్ బంతులతో తాను ఇబ్బంది పడుతున్నట్టు తెలిపాడు. వాటిని ఎదుర్కోవటానికి వికెట్ కీపర్, స్లిప్ మీదుగా ఆడటానికి ప్రయత్నించాడు. అలాగే మా స్వదేశంలో జరిగే సిరీస్‌ల్లోనూ సచిన్‌ను ఔట్ చేయగలమని నేను ఎప్పుడూ అనుకోలేదు. మేము అతడని ఔట్ చేయడానికి ఏదైన ప్రణాళిక రచిండానికి బదులు అతడే ఏదైనా తప్పుచేసి మైదానం నుంచి వెనుదిరుగుతాడని ఆశించాం."
- షాన్ పొలాక్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్

పొలాక్.. వన్డేల్లో 393, టెస్టుల్లో 421 వికెట్లతో సఫారీ బౌలర్లలో మేటిగా పేరుగాంచాడు. 3,500 పరుగులనూ సాధించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ అన్ని ఫార్మాట్లలో 34,357 పరుగులతో క్రికెట్ గాడ్‌గా వెలుగొందుతున్నాడు.
ఇదీ చూడండి.. గాయంతోనే ప్రపంచకప్ ఆడా: షమీ