వన్డే ఫార్మాట్లో సూపర్ ఓవర్ అవసరం లేదని న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ టై అయితే, ట్రోఫీని ఇరు జట్లు సమానంగా పంచుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదని వెల్లడించాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశాడు టేలర్.
"వన్డేల్లో సూపర్ ఓవర్ల గురించి ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. చాలా కాలంగా వన్డే టోర్నీలు జరుగుతున్నాయి. ఒకవేళ టై అయితే, దాన్ని అలాగే ప్రకటించినా ఎలాంటి సమస్య ఉండదు. టీ20లో సూపర్ ఓవర్ ఉండటం సరైనదే. కానీ, వన్డేల్లో అవసరం అని నేను అనుకోవడం లేదు. టై అయితే, ఇరుజట్లను విజేతలుగా ప్రకటిస్తే బాగుంటుంది."
-టేలర్, న్యూజిలాండ్ క్రికెటర్
గతేడాది న్యూజిలాండ్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో ఇరుజట్ల స్కోర్లు సమం కాగా సూపర్ ఓవర్ నిర్వహించారు. అందులోనూ రెండు జట్లు ఒకే పరుగులు సాధించగా.. బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో ఐసీసీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఫలితంగా ఈ నిబంధనను సర్దుబాటు చేస్తూ.. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో విజేతలు తేలే వరకు సూపర్ ఓవర్ల నిర్వహణకు అనుమతిచ్చింది ఐసీసీ.
ఇదీ చూడండి:ఆ రికార్డు సాధించిన ఏకైక క్రికెటర్‌గా టేలర్