బిగ్‌బాష్ లీగ్‌లో తీసుకువచ్చిన కొత్త నిబంధనల్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఆ నిబంధనలు జిమ్మిక్కులని, ఆటను తప్పుదారి పట్టించే ప్రయత్నాలని విమర్శించాడు. డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న బిగ్‌బాష్ లీగ్ 10వ సీజన్‌లో.. పవర్ సర్జ్, ఎక్స్-ఫ్యాక్టర్, బాష్ బూస్ట్.. అనే మూడు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.
"బిగ్‌బాష్ లీగ్‌లోని కొత్త జిమ్మిక్కులు పవర్ సర్జ్, ఎక్స్-ఫ్యాక్టర్, బాష్ బూస్ట్ గురించి చదివాను. టోర్నీని ఆకర్షణీయంగా మార్చాలనే క్రమంలో ఆటను తప్పుదారి పట్టించే ప్రయత్నమిది. చక్రం విరగకముందే దాన్ని బాగు చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కావట్లేదు. వీక్షకులను పెంచేందుకు చేస్తున్న కొత్త ప్రయోగాలివి. వీటిని ప్రాథమిక దశలో ఆటగాళ్లు, కోచ్‌లతో ప్రయత్నించకుండా నేరుగా ప్రవేశపెట్టడం నిరాశకు గురిచేసింది."
-వాట్సన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.
ఎక్స్-ఫ్యాక్టర్ నిబంధనతో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ చేయొచ్చు. అయితే తొలి 10 ఓవర్లకు పూర్తయ్యాకే ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. అలాగే 'పవర్‌సర్జ్'తో ఇన్నింగ్స్ రెండో అర్ధభాగంలో బ్యాటింగ్ జట్టు ఏ సమయంలోనైనా రెండు ఓవర్ల పవర్‌ప్లేను తీసుకోవచ్చు. ఈ నిబంధన కోసం ఇన్నింగ్స్ ఆరంభ పవర్‌ప్లేను ఆరు ఓవర్లకు బదులు నాలుగు ఓవర్లకు కుదించారు. ఇక బాష్ బూస్ట్ నిబంధన జట్టుకు అదనపు పాయింట్ లభించే అవకాశం ఇస్తుంది. మ్యాచ్‌లో తొలి పది ఓవర్లలో ఏ జట్టు అత్యధిక స్కోరు చేస్తుందో, ఆ జట్టుకు బోనస్‌గా ఓ పాయింట్ కేటాయిస్తారు. అప్పటికి రెండు జట్ల స్కోర్లు సమానంగా ఉంటే తలో అర పాయింటు ఇస్తారు.
ఇదీ చూడండి : 'ఓ ఘట్టం ముగిసింది.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'