బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్.. పరమత ఆరాధన చేశాడని ఆరోపిస్తూ, అతడ్ని చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ నెటిజన్. షకీబ్ ప్రవర్తన ముస్లింలను బాధించేలా ఉందని మొహిసిన్ తాలూక్దర్ ఫేస్బుక్ లైవ్‌లో పేర్కొన్నాడు. ఖడ్గంతో షకీబ్‌ను ముక్కలు చేస్తానని అన్నాడు. అవసరమైతే షకీబ్‌ను చంపడానికి సిల్హెట్ నుంచి ఢాకా వరకు నడుచుకుంటూ వస్తానని చెప్పాడు.
పూజలో పాల్గొన్నందుకే..
కోల్‌కతాలో జరిగిన కాళీ పూజలో షకీబ్ పాల్గొన్నాడనే కారణంతోనే నెటిజన్ బెదిరించినట్లు తెలుస్తోంది. "ఈ విషయం మాకు ఇప్పుడే తెలిసింది. వీడియో లింక్‌ను సైబర్ ఫోరెన్సిక్ బృందానికి అప్పగించాం. త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు" అని సిల్హెట్ అదనపు డిప్యూటీ కమిషనర్ బి.ఎం.అష్రఫ్ ఉల్లా తెలిపారు.
వీడియోలు తొలగించారు
ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత తన చర్యలకు క్షమాపణలు కోరుతూ.. మొహిసిన్ మరో లైవ్ వీడియో షేర్ చేశాడు. షకీబ్‌తో సహా ప్రముఖులందరూ సరైన మార్గాన్ని అనుసరించాలని సూచించాడు. అయితే మొహిసిన్ పోస్ట్ చేసిన రెండు వీడియోలను ఫేస్బుక్ తొలగించింది.
కాళీ పూజ కోసం కోల్‌కతాకు
బెలీఘట్ ప్రాంతంలో కాళీ పూజ సందర్భంగా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కోల్‌కతాకు గురువారం వెళ్లాడు. ఆ విగ్రహానికి ప్రార్థన కూడా చేశాడు. పూజ పూర్తయిన తర్వాత విమానంలో బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చాడు. ఐసీసీ షకీబ్‌పై విధించిన రెండేళ్ల నిషేధం ఈ ఏడాది అక్టోబరు 29తో పూర్తయ్యింది.