కరోనా కారణంగా పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను వాయిదా వేసింది ఆ దేశ క్రికెట్ బోర్డు. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. తాజాగా ఈ వాయిదాపై స్పందించిన పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ.. టోర్నీ వాయిదా వేయడం సరైంది కాదని తెలిపాడు.
"పాకిస్థాన్‌లో పీఎస్ఎల్ పెద్ద బ్రాండ్. ఈ టోర్నీని వాయిదా వేయడం ద్వారా పీసీబీ వద్ద 'ప్లాన్ బీ' లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇంత పెద్ద టోర్నీలో కరోనా కేసులు వస్తే ఏం చేయాలనేది బోర్డు ఆలోచించలేదు. ఇదే నాకు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టోర్నీ వాయిదా సరైంది కాదు"
-అఫ్రిదీ, పాక్ మాజీ క్రికెటర్
పీఎస్ఎల్ ఫ్రాంచైజీ క్వెట్టా గ్లాడియేటర్ యజమాని నదీమ్ ఓమర్ కూడా పీసీబీపై విమర్శలు చేశారు. ఇంత పెద్ద టోర్నీ కోసం బయోబబుల్‌ను ఏర్పాటు చేయడంలో పీసీబీ విఫలమైందని ఆరోపించారు. బోర్డు, పీఎస్ఎల్ ఫ్రాంచైజీల మధ్య సమాచార లోపం ఉందని పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణినే వెల్లడించారని తెలిపారు. ఇదే బయోబబుల్ విఫలమవడానికి కారణమని పేర్కొన్నారు.