ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన మరో ఏడుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా సోకినట్లు తేలింది. దీనికి సంబంధించి ఆ దేశ క్రికెట్ బోర్డు మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఆ జట్టులో మొత్తం పది మంది ఆటగాళ్లకు వైరస్ నిర్ధరణ అయ్యింది.
"ఒకేసారి పది మంది ఫిట్‌గా ఉన్న క్రికెటర్లకు కరోనా సోకడం మామూలు విషయం కాదు. ఆటగాళ్లకే సోకితే మిగిలిన వారందరికీ సోకే అవకాశం ఉంది".
- వసీం ఖాన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈఓ
వైరస్ సోకిన్ పాక్ ఆటగాళ్లలో.. కాషిఫ్ భట్టి, మహ్మద్ హస్నైన్, ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్, ఇమ్రాన్ ఖాన్, హఫీజ్, రియాజ్‌లు ఉన్నారు. అయితే సోమవారం చేసిన కరోనా పరీక్షల్లో షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, హారిస్ రవూఫ్లకు పాజిటివ్‌గా తేలింది.
వీరితో పాటు సహాయ సిబ్బంది మలంగ్ అలీకీ కొవిడ్ సోకినట్లు తేలింది. వీరందరికీ జూన్ 25న మరోసారి కరోనా టెస్ట్‌లు చేస్తామని పాక్ క్రికెట్ బోర్డు సీఈఓ వసీం ఖాన్ వెల్లడించాడు. అయితే ఇంగ్లాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు జూన్ 28న వెళ్లాల్సి ఉంది.