భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక బాధ్యతను బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) కపిల్‌దేవ్ బృందానికి అప్పగించింది. ఈ విషయంపై బీసీసీఐ నైతిక విలువల కమిటీ అధికారి జస్టిస్ డీకే జైన్‌కు ఫిర్యాదు చేశాడు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా.
కోచ్ ఎంపిక బాధ్యతను కపిల్ బృందానికి ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిబంధనల ప్రకారం క్రికెట్ సలహా కమిటీని నియమించే అధికారం సీఓఏకు లేదని తెలిపాడు.
" బీసీసీఐ నిబంధన 26(2)-ఏ(ii) ప్రకారం క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని నియమించే అధికారం సీఓఏకు లేదు. ఈ అధికారం బీసీసీఐ ఏజీఎమ్‌కు మాత్రమే ఉంది. గతంలో మహిళా జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్ నియమాకం రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. మరోసారి అటువంటి పరిస్థితి ఏర్పడుతోంది".
- సంజీవ్ గుప్తా, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు
పరస్పర విరుద్ధ ప్రయోజనం:
బీసీసీఐ నూతన నిబంధనల ప్రకారం ఏ వ్యక్తి రెండు పదవుల్లో ఉండకూడదు. ఎవరైనా ఆ విధంగా ఉంటే పరస్పర విరుద్ధ ప్రయోజనం కింద భావించి ఏదో ఒక అధికారం వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నియమం వల్లే గతంలో క్రికెట్ సలహా కమిటీలో ఉండే సచిన్, లక్ష్మణ్, గంగూలీ బృందం ఆ పదవి నుంచి తప్పుకుంది. ఈ త్రయం వైదొలిగిన తర్వాత టీమిండియా జట్టు కోచ్ ఎంపిక కోసం తాత్కాలిక సీఏసీ కమిటీని ఏర్పాటు చేసింది బీసీసీఐ పాలకుల కమిటీ. ఇందులో కపిల్‌దేవ్, శాంతా రంగస్వామి, అన్షుమన్ గైక్వాడ్ సభ్యులు. అయితే ఈ కొత్త బృందం నిబంధన 38(4)ను ఉల్లంఘిస్తున్నట్లు పేర్కొన్నాడు గుప్తా.
" బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకే అధికారంలో ఉండాలి. కానీ కపిల్ దేవ్, శాంతా రంగస్వామి ఇండియన్ క్రికెటర్ అసోసియేషన్‌కు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అన్షుమన్ గైక్వాడ్ బీసీసీఐ అనుబంధ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. వీళ్లందరూ ఈ పదవుల్లో ఉంటూనే సలహా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అందుకే ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుంది" అని వివరించాడు సంజీవ్ గుప్తా.