చెపాక్ పిచ్ వికెట్లు తీసేందుకు సహకరించట్లేదని టీమ్ఇండియా పేసర్ బుమ్రా అన్నాడు. పిచ్ చదునుగా ఉండటం వల్ల బంతి బౌన్స్ అవట్లేదని అన్నాడు. బంతి మెరవడానికి తమకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నయ దారులను పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. సలైవా(ఉమ్మి) పూయకుండా బౌలింగ్ చేయడం చాలా కష్టంగా ఉందని వెల్లడించాడు. ఐసీసీ విధించిన ఈ నిషేధం వల్ల బౌలర్లకు చేయి తీసేసినట్లుందని అన్నాడు. బంతి మెరవడానికి.. ఉమ్మితో పోలిస్తే చెమట అంతగా ప్రభావం చూపదని చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్తో తొలి టెస్టు తొలి రోజు పూర్తయిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు బుమ్రా.
కుల్దీప్ను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని బుమ్రా చెప్పాడు. పరిస్థితులకు తగ్గట్లే అలా చేయాల్సి వచ్చిందని అన్నాడు. జట్టులోని ప్రతి ఆటగాడికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని వెల్లడించాడు. రూట్ శతకంపై ప్రశంసలు కురిపించాడు. అతడు స్పిన్నర్లను వ్యూహాత్మకంగా ఎదుర్కొనే విధానం చాలా బాగుందని మెచ్చుకున్నాడు.
ఈ మ్యాచుతోనే బుమ్రా భారత్ గడ్డపై తొలిసారి టెస్టు ఆడాడు. ఇప్పటివరకు భారత జట్టు తరఫున 17 టెస్టులకు అతడు ఆడగా అవన్నీ వీదేశీ గడ్డపై ఆడటం విశేషం. ఈ పోరులో అతడు రెండు వికెట్లు తీశాడు. భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు తొలి రోజు పూర్తయ్యేసరికి 263/3 పరుగులతో నిలిచింది ఇంగ్లాండ్. క్రీజులో రూట్ ఉన్నాడు.
ఇదీ చూడండి: బుమ్రాకు తొలి టెస్టు.. అభిమానుల్లో ఆసక్తి