ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కీలకమైన బ్యాట్స్‌మన్‌గా మయాంక్ అగర్వాల్ నిలుస్తాడని మాజీ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అభిప్రాయపడ్డారు. మయాంక్ అగర్వాల్‌కు ఓపెనింగ్ భాగస్వామిగా రోహిత్ శర్మ సరైనవాడని అన్నారు. అయితే తొలి రెండు టెస్టులకు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం వల్ల పృథ్వీషా లేదా కేఎల్ రాహుల్‌ను ఓపెనింగ్‌కు పంపాలని మాస్టర్ సూచించారు. వీరిద్దరిలో ఒకరు మయాంక్‌కు బ్యాటింగ్ భాగస్వామిగా బరిలో దిగే అవకాశం ఉందని తెలిపారు.
"ఆస్ట్రేలియాపై మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. రోహిత్ శర్మ అందుబాటులో లేని కారణంగా అతడికి బదులుగా పృథ్వీషా లేదా కేఎల్ రాహుల్ సరైన ఎంపిక. ఏదేమైనా జట్టు యాజమాన్యందే తుది నిర్ణయం."
- సచిన్ తెందూల్కర్, భారత మాజీ క్రికెటర్
2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మయాంక్ అగర్వాల్ ఆస్ట్రేలియాపై మూడు సెంచరీలు చేశాడు. మరోవైపు యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ అద్భుమైన ఓపెనర్. కానీ, గిల్ ఇప్పటివరకు టెస్టు క్రికెట్లో ఆడలేదు. ఆస్ట్రేలియా వంటి ప్రతిష్ఠాత్మక టెస్టు సిరీస్ తుది జట్టులో.. గిల్‌కు అవకాశం లభిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
'నమ్మకం ఉంది..'
ఆస్ట్రేలియాతో 2018-19లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో టీమ్ఇండియా చారిత్రక విజయాన్ని నెలకొల్పింది. అంతర్జాతీయ క్రికెట్లో నిషేధం కారణంగా డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఆ సిరీస్‌లో పాల్గొనలేదు. వారిద్దరూ ప్రస్తుత సిరీస్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు లబుషేన్ అరంగేట్రం చేసిన ఒకటిన్నర ఏడాదిలోనే మెరుగైన ర్యాంకును సాధించాడు. ఈ ముగ్గుర్ని టీమ్ఇండియా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని సచిన్ అభిప్రాయపడ్డారు. చివరి మూడు టెస్టులకు కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవడం టీమ్ఇండియాకు తీరని లోటని.. కానీ, భారత జట్టులోని యువ ఆటగాళ్లపై తనకు నమ్మకం ఉందని మాస్టర్ బ్లాస్టర్ అన్నారు.