ఒకానొక సందర్భంలో సహచరుడు, టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్‌పై అరిచానని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ చెప్పాడు. 1998లో షార్జాలో జరిగిన కోకొకోలా కప్ సందర్భంగా మాస్టర్ పరుగుల తుపాను సృష్టించాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో శతకాలతో చెలరేగి, ఫైనల్లో ఆసీస్‌పై భారత్‌ను గెలిపించాడు. అయితే, ఆ సిరీస్ గెలిచి ఇంటికొచ్చిన తనకు సోదరుడు అజిత్ తెందుల్కర్ నుంచి చీవాట్లు పడ్డాయని చెప్పాడు.
ఫైనల్‌కు ముందు ఆసీస్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ముందు 285 పరుగుల భారీ లక్ష్యం ఉంది. మధ్యలో ఆటకు అంతరాయం కలగడం వల్ల లక్ష్యాన్ని 46 ఓవర్లలో 276 పరుగులకు కుదించారు. సచిన్(143; 131 బంతుల్లో) శతకంతో చెలరేగినా, టీమిండియా ఓటమిపాలైంది. ఆనాటి మ్యాచ్ విషయాల్ని లిటిల్ మాస్టర్ ఇటీవల స్టార్‌స్పోర్ట్స్ 'క్రికెట్ కనెక్టెడ్' కార్యక్రమంలో గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌పై అరిచానని చెప్పాడు.
"ఆ రోజు నాకింకా గుర్తు. మ్యాచ్ మధ్యలో రెండు, మూడు సార్లు లక్ష్మణ్‌పై అరిచాను. రెండు పరుగులు తీయాలని చెబుతున్నా.. ఎందుకు పరుగెట్టలేకపోతున్నావ్? అని గట్టిగా అడిగాను. ఇదే విషయంపై ఇంటికొచ్చాక నా సోదరుడితో చీవాట్లు పడ్డాయి. మైదానంలో మరోసారి ఇలాంటివి జరగకూడదు. లక్ష్మణ్ నీ సహచరుడు. అతను జట్టు కోసమే ఆడుతున్నాడు. అది నీ ఒక్కడి మ్యాచ్ కాదు' అని నాపై మా అన్నయ్య కోపడ్డాడు"
- సచిన్, టీమిండియా మాజీ క్రికెటర్
"ఆ మ్యాచ్‌లో గెలిచి గర్వంగా ఫైనల్‌కు వెళ్లాలనుకున్నా. గెలిచి ఫైనల్‌కు క్వాలిఫై అయితేనే తదుపరి మ్యాచ్‌కు మానసికంగా ధైర్యం వస్తుందని భావించా. అందుకే, నేను మ్యాచ్ గెలవడానికే తొలి ప్రాధాన్యతనిచ్చా. ఒకవేళ అది కుదరకపోతే రన్‌రేట్‌తో అర్హత సాధించి, తర్వాత ఫైనల్లో అయినా గెలవాలనుకున్నా. అదే నా ఆలోచన" అని సచిన్ నాటి సంగతుల్ని వివరించాడు. ఆ మ్యాచ్‌లో లక్ష్మణ్ 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరికి టీమిండియా 250 పరుగులు చేసి ఓటమిపాలైంది. రన్‌రేట్ ఆధారంగా ఫైనల్ చేరిన భారత్.. అక్కడ ఆసీస్‌ను ఓడించింది. ఫైనల్లోనూ సచిన్(134) మరో శతకం చేసి ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు.