మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్‌పై బాల్ ట్యాంపరింగ్ అభియోగం నమోదు చేసి యావత్ క్రికెట్ అభిమానులకే షాకిచ్చిన మ్యాచ్ అది. దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరిగిన పోరులో ఈ ఘటన జరిగింది. తాజాగా సఫారీలతో టీమిండియా టీ20 మ్యాచ్‌లకు సన్నద్ధమైన వేళ ఆ ఘటనపై పూర్తి వివరాలు.
దక్షిణాఫ్రికా పర్యటనలో...
2001 నవంబరులో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించింది. 3 టెస్టుల సిరీస్‌లో అప్పటికే ఓ మ్యాచ్ గెలిచి సఫారీలు ముందున్నారు. సిరీస్ నిలవాలంటే భారత్ గెలవకతప్పని పరిస్థితి. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు 362 ఆలౌటవగా... టీమిండియా 201కే పరిమితమైంది.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. కానీ జాక్వెస్ కలిస్ (89*) అజేయంగా నిలిచాడు. మ్యాచ్ సాగే కొద్దీ భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోతున్నారు. అప్పుడు బంతి అందుకున్నాడు సచిన్. మరే బౌలర్‌కు సాధ్యం కాని రీతిలో బంతిని స్వింగ్ చేశాడు. దీంతో ఆశ్చర్యపోయిన స్థానిక టీవీ ప్రొడ్యూసర్ సచిన్ బౌలింగ్‌ను శ్రద్ధగా చిత్రీకరించాలని సిబ్బందికి సూచించాడు.
- సచిన్ తన ఎడమచేతి చూపుడు వేలితో బంతి సీమ్‌ను గీరుతూ కనిపించాడు. ఈ వీడియో చర్చనీయాంశమైంది. కోట్ల మంది ఆరాధించే మాస్టర్ బ్లాస్టర్ మోసగాడు అనే ముద్ర వేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.
మాస్టర్ సహా ఆరుగురిపై వేటు...
సఫారీ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ జాక్వెస్ కలిస్ ఎంతకూ ఔటవ్వడం లేదు. కానీ అతడిచ్చిన క్యాచ్‌ను యువకుడైన సెహ్వాగ్ అందుకున్నాడు. ఐతే బంతి నేలకు తాకీ తాకనట్టుగా కనిపించింది! ఆట నువ్వానేనా అన్నట్టు సాగుతుండటం వల్ల ఆ సమయంలో సెహ్వాగ్ తీవ్రంగా అప్పీల్ చేశాడు. అతడితో పాటు శివసుందర్ దాస్, కీపర్ దీప్‌దాస్ గుప్తా, హర్భజన్‌సింగ్ గట్టిగా మద్దతు తెలిపారు. వీరూ కాస్త కఠిన పదజాలం ఉపయోగించాడు.
- నాలుగో రోజు ఉదయం భారత డ్రస్సింగ్ రూమ్‌కు వచ్చిన మ్యాచ్ రిఫరీ మైక్ డెన్నిస్.. బాల్ ట్యాంపరింగ్ చేసారన్న కారణం మోపి సచిన్‌పై ఓ మ్యాచ్ నిషేధం విధించాడు. అతిగా అప్పీల్ చేసినందుకు మిగతా నలుగురిపైనా ఒక్కో మ్యాచ్ ఆటకుండా వేటు వేశాడు.
- జట్టు సభ్యులను నియంత్రించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ సారథి దాదాపైనా నిషేధం అమలు చేశాడు డెన్నిస్. వీరందరి మ్యాచ్ ఫీజ్‌లో 75% కోత వేశాడు.
సచిన్ బాల్ ట్యాంపరింగ్ చేశాడని రిఫరీ డెన్నిస్ తనంతట తనే ధ్రువీకరించుకున్నాడు. గంగూలీపైనా అతడే వేటు వేశాడు. వీరిద్దరిపై మైదానంలోని అంపైర్లు అసలు ఫిర్యాదు చేయలేదు. అయితే నిబంధనలను ఉల్లఘించి అప్పీలు చేసిన నలుగురిపై అంపైర్లు ఫిర్యాదు చేశారు. ఇదే విషయం భారత్‌లో చర్చజరగడం వల్ల డెన్నిస్‌పై జాతి వివక్ష ఆరోపణలు వెల్లువెత్తాయి.
భారత అభిమానులు ఫైర్...
సచిన్‌పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో అభిమానులు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. మైక్ డెన్నిస్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. భారత ఆటగాళ్లు అందరిపై అభియోగాలను వెనక్కి తీసుకోకపోతే వెనక్కి తగ్గొద్దని బీసీసీఐని డిమాండ్ చేశారు. వెంటనే బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా రంగంలోకి దిగాడు. తమ అభ్యంతరాలను పట్టించుకోకుంటే సిరీస్ నుంచి మధ్యలోనే వైదొలగుతామని హెచ్చరించాడు.
- ఇంతజరిగినా అభియోగాలను వెనక్కి తీసుకొనేందుకు డెన్నిస్ నిరాకరించాడు. పరిస్థితి తీవ్రంగా మారింది. డీడీసీఏ క్రికెట్ బోర్డులో సభ్యుడైన కీర్తీ ఆజాద్ అప్పుడు ఎంపీ. ఆయన పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తాడు. సచిన్‌పై అకారణంగా వేటువేసినందుకు జట్టును వెనక్కి పిలిపించాలని డిమాండ్ చేశాడు.
- బీసీసీఐతో దక్షిణాఫ్రికా బోర్డు చర్చించింది. బీసీసీఐ హెచ్చరికలతో ఐసీసీ రంగంలోకి దిగింది. మూడో టెస్టుకు డెన్నిస్ ఉంటే మ్యాచ్ ఆడమని భారత జట్టు తెగేసి చెప్పింది. కామెంటేటర్ రవిశాస్త్రి ఈ వివాదాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.
- మీడియా నుంచి ప్రశ్నలు అధికమవడం వల్ల చివరికి ఐసీసీ రంగంలోకి దిగింది. ఫలితంగా డెన్నిస్ ఐదుగురు క్రికెటర్లపై నిషేధాన్ని వెనక్కి తీసుకున్నాడు. వీరూపై మాత్రం అలాగే ఉంచాడు. దాన్నీ తొలగించాలని టీమిండియా డిమాండ్ చేసింది.
ఈ ఘటనపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన ఆత్మకథలో ప్రస్తావించాడు. ఆ బాల్ ట్యాంపరింగ్ వేటు సమయంలో అసలు జరిగిన విషయాన్ని అందులో పేర్కొన్నాడు.
" నేను మోసం చేయలేదు. అలా జరగడం దురదృష్టకరం. సీమ్‌పై ఉన్న మట్టిని మాత్రమే నా వేలితో తొలగించాను. బంతి ఆకారాన్ని మార్చలేదు. ఈ విషయం ముందుగా అంపైర్లకు చెప్పాల్సింది ".
-ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వేలో సచిన్
వివాదానికి ఫుల్స్టాప్...
ఈ గొడవకు కారణమైన డెన్నిస్‌ను మూడో టెస్టుకు రిఫరీ బాధ్యతల నుంచి తొలగించారు. దక్షిణాఫ్రికా క్రికెట్‌తో సత్సంబంధాలు, క్రీడాస్ఫూర్తి కోసమని చివరి టెస్టును భారత్ ఆడింది. రిఫరీ లేకపోవడం వల్ల ఆ ఆటను స్నేహపూర్వక మ్యాచ్‌గా నమోదు చేశారు. అధికారికంగా రికార్డుల్లో లేదు.
సెహ్వగ్ పైనా నిషేధం తొలగించకపోవడంతో బీసీసీఐ ఏ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్‌కూ అతడిని ఎంపిక చేసింది. అయితే సెహ్వాగ్‌ను ఆడిస్తే మ్యాచ్‌ను అధికారికంగా పరిగణించబోమని ఐసీసీ తెలిపింది. చివరికి అన్ని బోర్డుల మధ్య సామరస్య పూర్వకంగా చర్చలు జరగడం వల్ల తొలి టెస్టుకు సెహ్వాగ్‌ను ఆడించలేదు. అలా ఈ వివాదం సమసిపోయింది. కానీ దక్షిణాఫ్రికాతో ఎప్పుడు ఆడినా ఈ సంఘటన గుర్తొస్తుంది.
ఇదీ చదవండి: బాక్సింగ్: పంఘాల్ పంచ్‌కు పతకం పక్కా