భారత్-న్యూజిలాండ్ మధ్య నామమాత్ర మూడో వన్డే మంగళవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా బౌలర్ శార్దుల్ ఠాకుర్. ప్రతి మ్యాచ్ తమకు ముఖ్యమైనదేనని, అయితే వన్డే సిరీస్ ఓడిపోవడానికి కారణం ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ అని అన్నాడు.
"ప్రతి మ్యాచ్ ముఖ్యమైనదే. వరుసగా రెండు వన్డేలు ఓడి, సిరీస్ కోల్పోయాం. అయినా చివరి మ్యాచ్‌కు ప్రాధాన్యత ఉంటుంది. స్వేచ్ఛగా ఈ పోరుకు సిద్ధమవుతున్నాం. ఇందులో గెలిచి మేమేంటో నిరూపించుకుంటాం. కివీస్ సిరీస్ గెల్చుకోవడంలో రాస్ టేలర్‌ది కీలక పాత్ర. అతడి బ్యాటింగ్ చేస్తున్న తీరు మతిపోగొడుతుంది. ప్రధానంగా టేలర్.. లెగ్‌సైడ్ ఆడేటప్పుడు దేవుడు ఆడుతున్నట్లు ఉంటుంది. అతడ్ని ఎంత తొందరగా పెవిలియన్‌కు పంపిస్తే, అంత పైచేయి సాధించే వీలుంటుంది" -శార్దుల్ ఠాకుర్, టీమిండియా బౌలర్
ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలని భావిస్తోంది. తర్వాత రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. అంతకు ముందు జరిగిన టీ20 సిరీస్.. 5-0 తేడాతో సొంతం చేసుకుంది కోహ్లీసేన.