వరుసగా మూడు టెస్టుల్లో మూడు శతకాలు చేసిన రూట్.. కోహ్లి, విలియమ్సన్, స్మిత్‌తో కలిసి ప్రపంచంలోనే అత్యుత్తమ నలుగురు ఆటగాళ్లలో ఒకడిగా నిరూపించుకున్నాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అన్నాడు.
"తన వందో టెస్టులో శతకం చేసిన రూట్.. తానో గొప్ప ఆటగాడినని రుజువు చేసుకున్నాడు. గతేడాది రూట్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో.. కోహ్లి, విలియమ్సన్, స్మిత్ లాంటి అత్యుత్తమ ఆటగాళ్ల సరసన అతను చేరగలడా అని కొంతమంది సందేహించారు. నిరుడు అతను 40కి పైగా సగటు నమోదు చేశాడని మర్చిపోవద్దు. కరోనా విరామంలో తనను తాను ప్రశ్నించుకున్న రూట్.. తిరిగి మునుపటిలా మారాడు. తన ఆటను విశ్లేషించుకున్నాడు. ఇప్పుడు వరుసగా మూడు టెస్టుల్లో శతకాలు చేయడమే అందుకు నిదర్శనం."
-నాసర్ హుస్సేన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.
నాసర్ వ్యాఖ్యలతో ఏకీభవించారు ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్. "నలుగురు అత్యుత్తమ ఆటగాళ్లు (కోహ్లి, స్మిత్, విలియమ్సన్, రూట్) అని మనం మాట్లాడుతున్నాం. వీళ్లలో రూట్ మినహా మిగతా ముగ్గురు అత్యుత్తమ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. కానీ రూట్ నిరుడు ఒక్క శతకం కూడా చేయలేదు. కరోనా విరామంలో తన ఆటను మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించాడు. ఇప్పుడా ఫలితాలు వస్తున్నాయి. ఈ ఏడాది అతనికి అత్యుత్తమంగా ఉండనుంది. భారత్‌లో పర్యటన, ఆస్ట్రేలియాలో యాషెస్ అంటే అవి చాలా ప్రతిష్ఠాత్మకమైన సిరీస్‌లు. ఆటగాళ్ల కెరీర్‌ను అవి నిర్దేశిస్తాయి. ఈ ఏడాది కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా అతనికి మంచి ఆరంభం దక్కింది. 2012లో కుక్ రాణించినట్లుగా ఈ సిరీస్‌లో రూట్ ఉత్తమంగా ఆడితే ఇంగ్లాండ్ మరోసారి భారత్‌లో సిరీస్ గెలిచే వీలుంది" అని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:'బోర్' కొట్టిస్తేనే టీమ్‌ఇండియాను కొట్టగలం!