టీమిండియా.. గత ఆరేళ్లలో ఐసీసీ టోర్నీలు గెలవకపోవడం గురించి మాట్లాడాడు వన్డే జట్టు ఉపసారథి రోహిత్‌శర్మ. ప్రస్తుతం యువ క్రికెటర్లు మెరుగవుతున్నారని... కచ్చితంగా భవిష్యత్తులో ఐసీసీ టోర్నీ ట్రోఫీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
"భారత జట్టులో ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. శ్రేయస్ నాలుగో స్థానంలో అదరగొడుతున్నాడు. వెస్టిండీస్‌తో వన్డేల్లో రిషభ్ మెరిశాడు. శివమ్ దూబే వెలుగులోకి వస్తున్నాడు. సవాళ్లను ఎదురించడంలో మా యువబృందం నిలబడుతుందన్న ధీమా ఉంది. వీరికి ఉన్న సమస్యేంటంటే వారంతా కలిసి ఎక్కువ మ్యాచులు ఆడలేదు. ఇప్పుడది సాధ్యమవుతోంది. వారు ఆత్మవిశ్వాసం పెంచుకుంటున్నారు. జట్టులో చోటుపై స్పష్టత వచ్చాక శ్రేయస్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ చక్కని ఆలోచనా ధోరణితో ముందుకెళ్తున్నాడు. రెండు, మూడు మ్యాచులకే ఒక బృందంగా వారిపై నిర్ణయానికి రావొద్దు. చాలినన్ని మ్యాచులు ఆడాక స్పష్టత రావాలి".
-- రోహిత్ శర్మ, భారత క్రికెటర్
33 ఏళ్ల రోహిత్ శర్మ మాట్లాడుతూ... కొన్ని ప్రపంచకప్‌లు గెలవడమే జట్టు ముందున్న లక్ష్యమని అన్నాడు. తన వీడ్కోలుపై ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పాడు. నాలుగో స్థానంలో ఆడిన తర్వాతే ఓపెనర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్నాననే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఐసీసీ టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ ట్రోఫీ గెలవాలని 'మెన్ ఇన్ బ్లూ' ఉత్సాహంగా ఉంది.