వరుసగా విఫలమవుతూ విమర్శల పాలవుతున్నాడు టీమిండియా యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్. మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చాడు. కొంత కాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఆదివారం వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 71 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం మాట్లాడుతూ ప్రతి మ్యాచ్ తనకు కీలకమేనని చెప్పాడు.
"ప్రతి మ్యాచ్‌లోనూ నా ప్రదర్శనను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు. వ్యక్తిగతంగా నాకు ప్రతి మ్యాచ్ కీలకమే. మనపై మనం నమ్మకం ఉంచుకోవాలి. జట్టు విజయం కోసం నేను ఏం చేయాలనే విషయంపై దృష్టి సారిస్తున్నా. ప్రేక్షకులు మద్దతు ఇస్తున్నపుడు భారీ స్కోర్ సాధించాలని ఉంటుంది. కానీ అలా చేయలేకపోయాను. మరింత రాణించేందుకు కృషి చేస్తున్నా"
-పంత్, టీమిండియా కీపర్
చెన్నైలో విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్.. 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. పంత్ (71), శ్రేయస్ (70) అర్ధశతకాలతో రాణించారు. కేదార్ జాదవ్ (40) ఫర్వాలేదనిపించాడు.
అనంతరం బరిలోకి దిగిన విండీస్.. రెండు వికెట్లు కోల్పోయి 47.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. హెట్మయిర్ (139), హోప్ (102*) శతకాలు బాదారు. హెట్మయిర్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది. విశాఖ వేదికగా రెండో వన్డే బుధవారం జరగనుంది.
ఇవీ చూడండి.. స్లో ఓవర్ రేట్.. విండీస్ జట్టుకు జరిమాన