ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రాహుల్ చక్కటి శతకం బాదాడు. కోహ్లీ కూడా ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ భారత్ అంత స్కోరు చేసిందంటే కారణం పంత్ మెరుపులే. అతను క్రీజులో అడుగు పెట్టేసరికి 32 ఓవర్లలో భారత్ చేసిన పరుగులు 158 మాత్రమే. అలాంటిది ఇంగ్లాండ్ ముందు 337 పరుగుల లక్ష్యం నిలిచిందంటే.. అది పంత్ విధ్వంసం వల్లే. క్రీజులో కుదురుకునే వరకు కొన్ని ఓవర్ల పాటు ఆచితూచి ఆడిన అతను.. రషీద్ వేసిన 38వ ఓవర్లో గూగ్లీని మోకాలిపై కూర్చుని మిడ్‌వికెట్‌లో సిక్సర్ బాది తన మార్కు మొదలుపెట్టాడు. తర్వాత స్టోక్స్ ఓవర్లో రెండు వరుస సిక్సర్లు కొట్టాడు. అతను ఒంటి చేత్తో ఒకటికి రెండు సిక్సర్లు బాదడం విశేషం.
![Pant sixes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/exzpe7fuyaqedfi_2603newsroom_1616766996_548.jpg)
ముందుగా సామ్ కరన్ ఆఫ్ స్టంప్ ఆవల వేసిన బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఒక చేయి పట్టు తప్పింది. ఎడమ చేతి బలాన్నే పూర్తిగా ఉపయోగించి బౌలర్ తల మీదుగా సిక్సర్ బాదేశాడు పంత్. ఒక్క చేత్తో షాట్ ఆడినా బంతి స్టాండ్స్‌లో పడటం విశేషం. తర్వాత టామ్ కరన్ బౌలింగ్‌లో వైడ్ వెళ్లేలా కనిపించిన బంతిని అందుకునే ప్రయత్నంలోనూ ఒంటి చేత్తోనే అతను థర్డ్‌మ్యాన్ దిశలో సిక్సర్ బాది ఔరా అనిపించాడు. కేవలం 28 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తయింది. ఇంకా 3.5 ఓవర్లు మిగిలుండగా.. పంత్ 38 బంతుల్లో 76 పరుగులతో నిలిచాడు. అతడి ఊపు చూస్తే భారత్ తరఫున వన్డేల్లో వేగవంతమైన శతకం రికార్డు (కోహ్లీ-52 బంతులు) బద్దలైపోతుందేమో అనిపించింది. కానీ టామ్ బౌలింగ్‌లో రాయ్ పట్టిన చక్కటి క్యాచ్‌కు వెనుదిరగక తప్పలేదు.