టీమ్‌ఇండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్.. ఆటలో తన ప్రత్యేకతను చాటుకోవాలని ఆస్ట్రేలియా మాజీ కీపర్ బ్రాడ్ హడిన్ సూచించాడు. ఇతరులను చూసి కాపీ కొట్టడం కన్నా సొంత ఆటను ఆడాలని చెప్పాడు. ఎవరి మీదైనా భారీ అంచనాలు ఉంటాయని, వాటిని పంత్ అధిగమించాలని అన్నాడు. అన్నిటికంటే ముఖ్యం పంత్ తన సహజమైన ఆటతీరుతో ప్రత్యేకత సాధించాలన్నాడు.
"పంత్.. జట్టుకు నీ ప్రత్యేకత చాటి చూపించు. నాకు తొలిసారి టెస్టు క్రికెట్ ఆడే అవకాశం వచ్చినప్పుడు.. ఆడం గిల్‌క్రిస్ట్, ఇయాన్ హేలీలా ముద్ర వేయాలనుకోలేదు. నా ప్రత్యేకతను బయటకు తీసుకురావాలనుకున్నా. ఇక్కడుండే అసలైన సవాలు ఏంటంటే.. ఇతరులతో పోల్చుకొని ఆడకు. అది నువ్వు కాదు. నీ సహజమైన ఆటను చూపించు."
-బ్రాడ్ హడిన్, ఆసీస్ మాజీ కీపర్
సీనియర్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ ఆటకు దూరమయ్యాక టీమ్‌ఇండియా పంత్, వృద్ధిమాన్ సాహాలతో నెట్టుకొస్తుంది. ఇటీవల పంత్ గాయపడిన సందర్భంలో కేఎల్ రాహుల్ కొత్త బాధ్యతలు స్వీకరించాడు. వికెట్ల వెనుక అతడు రాణించడం వల్ల పంత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయితే, ధోనీ తర్వాత ఆ బాధ్యతలను స్వీకరించేవారిపై సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో హడిన్.. ధోనీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత పదేళ్లుగా టీమ్‌ఇండియా ధోనీని కలిగి ఉండడం అదృష్టమని తెలిపాడు. అతడి బాధ్యతలు ఎవరు తీసుకున్నా వాళ్లు తమ ప్రత్యేకతను చాటుకోవడం ముఖ్యమని హడిన్ సూచించాడు.
"ధోనీ టీమ్‌ఇండియాకు, క్రికెట్‌కు ఎంతో విలువైన వారసత్వాన్ని ఇచ్చాడు, వారు అవకాశాలను సద్వినియోగం చేసుకొని, తమ ప్రత్యేకత చాటుకోవాలి. భారత కీపర్‌గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారో వారి ఇష్టం" అని తెలిపాడు. అనంతరం ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌పై స్పందించిన ఆసీస్ మాజీకీపర్.. స్వదేశంలో మెగా టోర్నీ జరుగుతున్నందున తమ జట్టు ఫేవరెట్‌గా ఉంటుందని చెప్పాడు. స్థానిక పిచ్‌లపై మంచి అవగాహన ఉండడం వల్ల అక్కడ లభించే బౌన్స్‌ను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఆస్ట్రేలియా జట్టుకు ఉందని హడిన్ వెల్లడించాడు.