క్రికెట్.. కొందరికి ఉల్లాసాన్నిచ్చే ఆట మాత్రమే. కానీ కొందరికి మాత్రం అదే జీవితం. అలాంటి వారిలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ముందు వరుసలో ఉంటాడు. కంగారూ జట్టుకు హ్యాట్రిక్ ప్రపంచకప్‌లు అందించినా, ఏళ్ల క్రితమే ఆటకు వీడ్కోలు పలికినా.. ఇంకా మైదానాన్ని వీడలేదు. తన తోటి ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమైనా ఇంకా ఆటనే నమ్ముకున్నాడు. ఇటీవలే ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోచ్‌గా పనిచేసిన ఈ దిగ్గజం.. దాదాపు మూడు నెలల పాటు శ్రేయస్ సారథ్యంలోని జట్టును మార్గనిర్దేశం చేశాడు. తన జట్టును ఫైనల్‌కు చేర్చడంలో తెరవెనుక బాగా కష్టపడ్డాడు. అయితే టోర్నీ దిగ్విజయంగా పూర్తయింది. అందరూ ఎవరి ఇళ్లకు వాళ్లు చేరుకున్నారు. కానీ పాటింగ్ మాత్రం విశ్రాంతి తీసుకోవట్లేదు.
నవంబర్ 27 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య పరిమీత ఓవర్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తన దేశ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తూ నెట్స్‌కే అంకితమయ్యాడు. ఆటగాళ్లకు బంతులు విసురుతూ ఆటలో మెలకువలు నేర్పిస్తున్నాడు. ఐపీఎల్ ఫైనల్ తర్వాత నుంచే కోచింగ్ బృందంలోని తన విధుల్లో చేరినట్లు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్, దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు స్టాయినిస్ తెలిపాడు.
ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్‌తో కలిసి ఆస్ట్రేలియా జట్టులోని సభ్యుకు విలువైన సలహాలు ఇస్తున్నాడు పాంటింగ్. సిడ్నీలోని క్వారంటైన్ హబ్‌లో నెట్స్‌లో బంతులు విసురుతూ ఇతడు బిజీగా ఉన్నట్లు స్టాయినిస్ తెలిపాడు.
"ఆటగాడిగానే కాకుండా అన్నింటిలో పాంటింగ్ అత్యుత్తమం. అతని గురించి చాలా విన్నాం. అయితే ప్రత్యక్షంగా తెలుసుకుని తనతో జర్నీ చేస్తే.. అతడు ఎంత మంచి వ్యక్తి, ఎంత మంచి ఆటగాడు అనేది తెలుస్తుంది. రికీ మనలో ప్రేరణను నింపగలడు" అని పాంటింగ్ గురించి చెప్పాడు స్టాయినిస్.