ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 21వ శతాబ్దంలో అత్యంత విలువైన భారత క్రికెటరని విజ్డన్ ప్రకటించింది. ప్రపంచంలో మురళీధరన్ తర్వాత అతడు రెండో అత్యంత విలువైన ఆటగాడని పేర్కొంది. జడేజా గత రెండేళ్లలో బంతి, బ్యాటుతో పాటు ఫీల్డింగ్‌లోనూ విశేషంగా రాణించాడు. అశ్విన్ తర్వాత అత్యంత వేగంగా టెస్టుల్లో 200 వికెట్లు (44 టెస్టులు) పడగొట్టిన భారత బౌలర్‌గా నిరుడు జడేజా ఘనత సాధించాడు.
క్రిక్‌విజ్ అనే టూల్ సహకారంతో గణాంకాలను విశ్లేషించడం ద్వారా విజ్డన్.. జడేజా విలువను తేల్చింది. ఈ విశ్లేషణ ప్రకారం జడేజా ఎంవీపీ (మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్) రేటింగ్ 97.3. మురళీధరన్ మాత్రమే అతడికన్నా ముందున్నాడు.
"స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జడేజా అత్యంత విలువైన భారత ఆటగాడిగా నిలవడం ఆశ్చర్యం కలిగించవచ్చు. ఎందుకంటే అతడు టెస్టులో చోటు ఖాయంగా ఉన్న ఆటగాడు కాదు. కానీ ఎప్పుడు ఆడినా ప్రధాన బౌలర్‌గా ఉంటాడు. బ్యాటుతోనూ ఎంతో విలువైన పరుగులు చేస్తాడు. జడేజా బౌలింగ్ సగటు (24.62).. షేన్ వార్న్ (35.26) సగటు కన్నా మెరుగు. అతడి బ్యాటింగ్ సగటు (35.26).. వాట్సన్ కన్నా ఎక్కువ. జడేజా నాణ్యమైన ఆల్‌రౌండర్."
- ఫ్రెడ్డీ విల్డే, క్రిక్‌విజ్
31 ఏళ్ల జడేజా ఇప్పటివరకు 49 టెస్టుల్లో 1869 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధశతకాలు, ఓ శతకం ఉన్నాయి. అతడి ఖాతాలో 213 వికెట్లు ఉన్నాయి. తొమ్మిదిసార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు.