కరోనా (కొవిడ్ 19) తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'జనతా కర్ఫ్యూ'కు విశేష స్పందన లభించింది. దేశవ్యాప్తంగా ప్రజలు స్వీయ నిర్బంధంతో ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా క్రికెటర్లూ జనతా కర్ఫ్యూకు మద్దతు ప్రకటించారు. తమ అభిమానులను ఈ మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోమని సామాజిక మాధ్యమాల వేదికగా సూచించారు. 'జనతా కర్ఫ్యూ' దిగ్విజయంగా కొనసాగుతున్న వేళ టీమిండియా బౌలర్ అశ్విన్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
" స్కూల్లో చెప్పినట్లు పిన్‌డ్రాప్ సైలెన్స్‌గా దేశమంతా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ.. సామాజిక దూరాన్ని పాటించాలి. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా మనమంతా ఓ జట్టు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తరఫున మీరెప్పుడైనా ఆడాలని కలగంటే.. ఇప్పుడు మీకో అవకాశం దక్కింది"
-- రవిచంద్రన్ అశ్విన్, భారత క్రికెటర్
నేడు(మార్చి 22న) జనతా కర్ఫ్యూ కోసం మోదీ పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రజలందరికీ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19, 3 లక్షల మందికి సోకగా.. 13 వేల మందికి పైగా మరణించారు. భారత్‌లో 341 కేసులు నమోదవగా.. ఐదుగురు మృతి చెందారు.