ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత కెప్టెన్ కోహ్లీ ఉండకపోవడం టీమ్ఇండియాపై ప్రభావం చూపుతుందని దిగ్గజ సచిన్ తెందుల్కర్ అన్నాడు. అయినప్పటికీ భారత జట్టు మంచి ప్రదర్శన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. విరాట్ లేకపోయినా సరే ముందుకు సాగేలా సంసిద్ధంగా ఉండాలని జట్టుకు సూచించాడు.
కోహ్లీ దూరం కానున్న నేపథ్యంలో తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టనున్న వైస్ కెప్టెన్ అజింక్య రహానె.. సమర్థమంతమైన నాయకుడని సచిన్ ప్రశంసించాడు. "కోహ్లీ కెప్టెన్సీకి రహానె కెప్టెన్సీకి వైవిధ్యం ఉంటుంది. విరాట్ దూకుడు అయితే రహానె చాలా ప్రశాంతంగా ఉంటాడు. పరిస్థితులను తగ్గట్లు నిర్ణయాలు బాగా తీసుకోగలడు. 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాతో టెస్టులో భుజం గాయం కారణంగా కోహ్లీ దూరమయ్యాడు. అప్పుడు కెప్టెన్సీ చేసిన రహానె.. ఓ బలమైన నాయకుడిగా జట్టును ముందుకు నడిపించాడు. ఆ పోరులో భారత గెలిచింది. ఎన్నో ఏళ్లుగా అతడిని చూస్తున్నాను. నిజాయతీ, అంకిత భావం, క్రికెట్ పరిజ్ఞానం ఉన్న ఆటగాడు. అతడికి నేనిచ్చే సలహా ఒక్కటే.. "నీ లాగానే నువ్వు ఉండు" అని లిటిల్ మాస్టర్ అన్నాడు.
రోహిత్ ఉంటే సమతుల్యం
"రోహిత్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు. కానీ అతడు ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు. అలాంటి ఆటగాళ్లు ఉన్నప్పుడు జట్టులో సమతుల్యమవుతుంది. హిట్‌మ్యాన్ విషయంలో టీమ్ఇండియా మేనేజ్మెంట్ సరైన నిర్ణయం తీసుకుంటుందని నా అభిప్రాయం" అని సచిన్ చెప్పాడు.
తొలి టెస్టు ఎంతో ముఖ్యం
ఆసీస్-టీమ్ఇండియా తొలి టెస్టు ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుందని సచిన్ అన్నాడు. ఇందులో గెలిచిన జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పాడు. "గాయం కారణంగా ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ వార్నర్, పకోవిస్కీ తొలి టెస్టుకు దూరమయ్యారు. టీమ్ఇండియా బౌలర్లు భువనేశ్వర్, ఇషాంత్ శర్మ అందుబాటులో లేరు. అయినా ఇరుజట్లు ఈ పోరులో గెలవాలని పట్టుదలతో ఆడతాయి. విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేం. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకు మరింత ఆత్మవిశ్వాసం వస్తుంది. కాబట్టి తొలి టెస్టు ఇరు జట్లకు ఎంతో ముఖ్యం" అని సచిన్ పేర్కొన్నాడు.
ఫేవరేట్ సెంచరీ
1992 ఫిబ్రవరి 3న పెర్త్‌లో ఆస్ట్రేలియాపై బాదిన శతకం(114) కెరీర్లోనే తనకు అభిమాన సెంచరీ అని మాస్టర్ చెప్పాడు. 2008 డిసెంబరు 15న చెన్నైలో ఇంగ్లాండ్‌తో టెస్టులో చేసిన శతకం (103) తన జీవితంలోనే ముఖ్యమైన, అర్ధవంతమైన సెంచరీ అని అన్నాడు.
సమర్థవంతంగా నడిపించగలడు
చివరి మూడు టెస్టులకు తాను లేకపోయినప్పటికీ రహానె తన బాధ్యతను చక్కగా నిర్వర్తించగలడని ధీమా వ్యక్తం చేశాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. అద్భుతంగా ఆడతాడని కితాబిచ్చాడు. తామిద్దరి మధ్య ఒకరినొకరు గౌరవించుకుని అర్ధంచేసుకోగల బంధం ఉందని చెప్పాడు. జట్టును సమర్ధవంతంగా నడిపించగల సత్తా అతడిలో ఉందని తెలిపాడు.
ఇదీ చూడండి : ఆ నిబంధనతో బౌలర్లకు కష్టమే: సచిన్