తన కెరీర్‌కూ 17వ నెంబర్‌కు ఏదో సంబంధం ఉందేమో అని అభిప్రాయపడ్డాడు అజింక్య రహానె. శతకం కోసం 17 టెస్టులు ఎదురుచూడాల్సి వచ్చిందని తెలిపాడు. అరంగేట్రం నుంచి ఇప్పటివరకూ ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు రహానె.
"ప్రతి మ్యాచ్, ప్రతి సిరీస్ నుంచి ఏదోకటి నేర్చుకోవాలి. టెస్టుల్లో అరంగేట్రం చేసేందుకు రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. అలాగే వెస్టిండీస్‌పై సెంచరీ కోసమూ రెండేళ్లు (17 టెస్టులు) వేచి చూడక తప్పలేదు. అందుకే 17వ నెంబర్‌తో ఏదో సంబంధం ఉంది" -అజింక్య రహానె, టీమిండియా క్రికెటర్
ఒంటరిగా కూర్చుని శతకం ఎందుకు చేయాలేకపోయానా అని ఆలోచించేవాడినని చెప్పాడు రహానె
"హ్యాంప్‌షైర్ తరపున ఆడినప్పుడు ఒంటరిగా ఆలోచించేవాడిని. నా టెస్టు అరంగేట్రం ముందు నా ఆలోచన ధోరణి ఎలా ఉండేది? 17 టెస్టులైనా సెంచరీ చేయలేకపోయానే లాంటి ఆలోచనలు సాగేవి. నేను శతకం కోసం ఆలోచించినంత కాలం అది నాకు దక్కలేదు. అందుకే విండీస్‌లో శతకం గురించి ఒక్కసారీ ఆలోచించలేదు. ఏమైనా జరగనివ్వండి అనుకున్నా. చేస్తే శతకం చేస్తాను అనుకున్నా" -అజింక్య రహానె, టీమిండియా క్రికెటర్
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 3, బంగ్లాదేశ్‌తో 2 మొత్తం ఐదు టెస్టులు ఆడనున్నామని, టెస్చు ఛాంపియన్‌షిప్‌లో ఏ జట్టును తేలికగా తీసుకోవట్లేదని తెలిపాడు రహానె.
"బయటి నుంచి అంతా బాగానే కనిపిస్తుంది. నా వరకైతే సామర్థ్యాన్ని నమ్మడం ముఖ్యం. టెక్నిక్ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. క్లిష్ట పరిస్థితుల నియంత్రణపై మానసికంగా దృష్టిపెట్టా. సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడనున్నప్పటికీ ఏ జట్టును తేలిగ్గా తీసుకోవట్లేదు. పాయింట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి మ్యాచ్ కీలకమే. గెలుపు, డ్రాకు మధ్య ఎంతో తేడా ఉంది" - అజింక్య రహానె, టీమిండియా క్రికెటర్
అంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సత్తాచాటాడు రహానె. తొలి ఇన్నింగ్స్‌లో 81 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులతో అద్భుత శతకం సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అక్టోబరు 2 నుంచి సఫారీలతో మూడు టెస్టులు ఆడనుంది టీమిండియా. విశాఖపట్టణం వేదికగా తొలి టెస్టు జరగనుంది.
ఇదీ చదవండి: 4వ స్థానంపై భజ్జీ ట్వీట్.. యువీ ఫన్నీ రిప్లై..!