టీమ్‌ఇండియాతో తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో దాదాపుగా చోటు ఖాయమైన విల్ పుకోవ్‌స్కీ గాయపడ్డాడు. భారత యువ పేసర్ కార్తీక్ త్యాగి విసిరిన బంతి అతడి తలకు తగిలింది. దీంతో కాసేపు అతడు మైదానంలో కూలబడ్డాడు. ఆ తర్వాత ఒంటరిగా మైదానం వీడాడు. ఇదంతా భారత్ ఏ, ఆసీస్ ఏ మధ్య ప్రాక్టీస్ టెస్టు మ్యాచులో చోటుచేసుకుంది.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17న ఆరంభం కానుంది. డే/నైట్‌లో గులాబి బంతితో ఇది జరుగుతుండటంతో రెండు జట్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. సుదీర్ఘ సిరీస్ కావడంతో బీసీసీఐ కోరిక మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా రెండు ప్రాక్టీస్ మ్యాచులను ఏర్పాటు చేసింది. సిడ్నీ వేదికగా జరిగిన తొలి సాధనా మ్యాచ్ డ్రాగా ముగిసింది. అజింక్య రహానె శతకం బాదగా పుజారా, వృద్ధిమాన్ సాహా అర్ధశతకాలు సాధించారు. ఆసీస్‌లో గ్రీస్ శతకం అందుకున్నాడు.
ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో పుకోవ్‌స్కీ ఓపెనింగ్ చేశాడు. అతడు 23 పరుగుల వద్ద ఉండగా కార్తీక్ త్యాగీ 13వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో ఓ బౌన్సర్ పుకోవ్‌స్కీ హెల్మెట్‌కు బలంగా తాకింది.
'పుకోవ్‌స్కీలో కంకషన్ లక్షణాలు స్వల్పంగా కనిపించాయి. అయితే సహాయకులు లేకుండానే అతడు మైదానం నుంచి వచ్చేశాడు. మా వైద్యబృందం అతడిని పర్యవేక్షిస్తోంది. కుటుంబ సభ్యులు, జట్టు సహచరులతో అతడు చక్కగా మాట్లాడుతున్నాడు. అతడు ఆసీస్ -ఏ జట్టులోనే ఉంటాడు. కానీ రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడడు' జట్టు యాజమాన్యం తెలిపింది.
ఇదీ చదవండి:ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌కు పితృవియోగం