పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఓ ఆటగాడికి కరోనా లక్షణాలు కనిపించాయని చెప్పాడు ఆ దేశ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రమీజ్ రాజా. ఇంగ్లాండ్‌కు చెందిన అలెక్స్ హేల్స్ టోర్నీ సమయంలో.. కొవిడ్-19 లక్షణాలతో ఉన్నట్లు రమీజ్ అభిప్రాయపడ్డాడు. కరాచీ కింగ్స్ తరఫున 7 మ్యాచ్‌లు ఆడిన హేల్స్.. కరోనా నేపథ్యంలో మిగతా ఇంగ్లీష్ ఆటగాళ్లతో కలిసి టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే అతడు ఎలాంటి టెస్టులు చేయించుకోకుండానే ఇంగ్లాండ్ వెళ్లాడని చెప్పాడు రమీజ్.
![PSL Corona: England cricketer Alex Hales might have Covid-19 symptoms before leaving tourney by ramiz raja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6440982_alex1000.jpg)
"నాకు తెలిసినంత వరకు అలెక్స్ హేల్స్ టెస్టులు చేయించుకోలేదు. అయితే టోర్నీ సమయంలో అతడు కరోనా తరహా లక్షణాలతో బాధపడ్డాడు. అయితే వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలాంటి విషయాల్లో అందరూ జాగ్రత్త వహించాలి".
- రమీజ్ రాజా, పాక్ మాజీ క్రికెటర్
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో వసీం ఖాన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఓ విదేశీ ఆటగాడు కరోనాతో ఇబ్బంది పడినట్లు చెప్పిన ఖాన్.. అతడి వివరాలు చెప్పడానికి నిరాకరించాడు.
మంగళవారం లాహోర్ వేదికగా జరగాల్సిన పీఎస్ఎల్ సెమీఫైనల్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌లను.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రద్దు చేశారు. పీఎస్ఎల్ ఆటగాళ్లు, ప్రసారదారు సంస్థకు సంబంధించిన వ్యక్తులకు కొవిడ్-19 టెస్టులు చేసినట్లు చెప్పారు నిర్వాహకులు. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7వేల మంది మరణించారు.