విజయ్ హజారే ట్రోఫీలో ముంబయి కెప్టెన్ పృథ్వీ షా మరో శతకం సాధించాడు. సెమీ ఫైనల్లో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 79 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు ఈ ఓపెనర్. తాజా సెంచరీతో ఇప్పటివరకు 754 పరుగులు చేసిన పృథ్వీ.. టోర్నీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
122 బంతులాడిన పృథ్వీ.. 17 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 165 పరుగులు చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు ముంబయి 49.2 ఓవర్లలో 322 పరుగులు చేసింది. గత మూడు మ్యాచ్‌లుగా ముంబయి జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఈ ఓపెనర్.. ఓ ద్విశతకంతో పాటు రెండు భారీ సెంచరీలు నమోదు చేయడం విశేషం.
లిస్టు-ఏ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా ఇటీవల రికార్డు నెలకొల్పిన పృథ్వీ.. ధోనీ, కోహ్లీలను అధిగమించాడు. ఇటీవల సౌరాష్ట్రపై కేవలం 123 బంతుల్లోనే 185 పరుగులు చేయడం ద్వారా పృథ్వీ ఈ ఫీట్‌ను సాధించాడు.
2005లో జైపూర్ వేదికగా శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో మహి 183 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో భాగంగా 2012లో పాకిస్థాన్‌పై 183 పరుగులు చేశాడు కోహ్లీ.
మయాంక్ రికార్డు బ్రేక్..
అదే విధంగా ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ రికార్డును పృథ్వీషా బద్దలుకొట్టాడు. 2017-18 ఎడిషన్‌లో మయాంక్ అగర్వాల్ అత్యధికంగా 723 పరుగులు నమోదు చేయగా.. ప్రస్తుత సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన పృథ్వీషా.. 754 రన్స్ చేశాడు.
మరోవైపు కర్ణాటక బ్యాట్స్‌మన్ దేవ్‌దత్ పడిక్కల్ కూడా ఇదే రికార్డుకు చేరువలో ఉన్నాడు. పడిక్కల్ ఇప్పటికే 673 పరుగులు నమోదు చేశాడు. ముంబయితో జరుగుతోన్న సెమీఫైనల్లో ఈ యువ బ్యాట్స్‌మన్ 82 రన్స్ చేస్తే.. పృథ్వీషా రికార్డునూ బ్రేక్ చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: భారత్‌తో టీ20లకు స్పిన్ పిచ్లైతేనే మేలు: మోర్గాన్