2018 ఆగస్టు తర్వాత భారత్ తరఫున టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టెస్టులు ఆడలేదు. వెన్నునొప్పి కారణంగా గతేడాది శస్త్రచికిత్స చేసుకుని, కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో మాత్రం ఇతడు ఉండాలని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ అభిప్రాయపడ్డాడు. టీమ్ఇండియాకు హార్దిక్ అదనపు బలమని చెప్పాడు.
"హార్దిక్ పాండ్య ఉంటే జట్టుకు ఎంతో ఉపయోగం. బౌలింగ్‌లో విభాగంలో అదనపు సీమర్ లోటును భర్తీ చేస్తాడు. అందువల్ల బౌలర్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైతే, సిడ్నీలో జరగబోయే నాలుగో టెస్టు కంటే ముందు జరిగే మూడు మ్యాచ్‌ల్లోనూ అతడు నిదానంగా ఓవర్లు వేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడు మూడో సీమర్లా ఉపయోగపడితే, అదనపు స్పిన్నర్‌ను తీసుకోవచ్చు. హార్దిక్ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తే పంత్ కీపింగ్ చేస్తూ ఆరో స్థానంలో బరిలో దిగొచ్చు"
-ఇయాన్ ఛాపెల్, ఆసీస్ మాజీ కెప్టెన్
ఇప్పటివరకు హార్దిక్ 11 టెస్టులు ఆడాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. మొత్తంగా ఈ ఫార్మాట్లో 532 పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు. చివరగా ఆగస్టు 2018లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నాడు.