కరోనా వైరస్ ముప్పుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సాధనా శిబిరాలన్నీ ఖాళీ అయ్యాయి. అన్ని ఫ్రాంచైజీలు తమ శిబిరాలను రద్దు చేస్తున్నామని ప్రకటించాయి. తిరిగి పిలుపునిచ్చేంత వరకు ఆటగాళ్లెవరూ రానవసరం లేదని వెల్లడించాయి. ఇప్పటికే ఐపీఎల్‌ను మార్చి 29 నుంచి ఏప్రిల్ 15కు వాయిదా వేశారు నిర్వాహకులు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సాధనా శిబిరాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం వారి శిబిరం మార్చి 21న ఆరంభం కావాల్సి ఉంది. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ శిబిరాలను ఇప్పటికే రద్దు చేశాయి.
"ప్రతి ఒక్కరి ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మార్చి 21న ఆరంభం కావాల్సిన ఆర్‌సీబీ శిక్షణ శిబిరాన్ని వాయిదా వేస్తున్నాం. మరోసారి నోటీసు ఇచ్చేంత వరకు ఆటగాళ్లెవరూ రానవసరం లేదు. అందరూ ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించాలని కోరుతున్నాం."
-ఆర్‌సీబీ
చెన్నై సూపర్ కింగ్స్ శనివారమే శిబిరాన్ని రద్దు చేసింది. ఆ జట్టు సారథి ధోనీ వెంటనే చెన్నై నగరాన్ని వీడి రాంచీకి చేరుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 1,60,000 మందికి కొవిడ్-19 సోకగా 6000 కన్నా ఎక్కువ మంది మృతిచెందారు.