పాకిస్థాన్‌లో జరుగుతున్న దేశీయ టీ20 టోర్నీలో ఆడుతోన్న ఓ ఆటగాడిని అనుమానాస్పద బుకీ సంప్రదించినట్లు పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) గురువారం ప్రకటించింది. రావల్పిండి వేదికగా జరుగుతున్న జాతీయ టీ20 కప్‌లో ఫిక్సింగ్ కొరకు ఆ ఆటగాడిని సంప్రదించినట్లు పీసీబీ అవినీతి నిరోధక, భద్రతా అధికారి ఆసిఫ్ మహమూద్ ధ్రువీకరించారు.
"పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక విభాగం తన సొంత దర్యాప్తు నిర్వహించి.. కొన్ని సున్నితమైన అంశాలను వెలికితీసింది. ఆ సమాచారాన్ని ఎఫ్ఐఎ (ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)కు పంపాం. ఫిక్సింగ్లపై దర్యాప్తు చేయడానికి అవసరమైన నైపుణ్యం, వనరులు, సామర్థ్యాలు, అధికారాలు బోర్డుకు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పట్లో బహిర్గతం చేయలేం. కొంతమంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆటగాళ్లను ప్రలోభపెట్టే అవకాశం ఉంది. కానీ, క్రికెటర్లంతా అవినీతి నిరోధక ప్రోటోకాల్స్‌కు కట్టుబడి ఉండి.. వాటికి సంబంధించిన వివరాలను బోర్డుకు తెలియజేస్తే, అలాంటి వ్యక్తులను సమష్టిగా ఓడించగలమని చెప్పడంలో సందేహం లేదు."
- పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటన
స్పాట్ ఫిక్సింగ్ దర్యాప్తునకు సంబంధించిన పురోగతిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు పీసీబీ చేరవేయాల్సి ఉంటుంది. పాకిస్థాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బాబర్ ఆజామ్, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్ వంటి ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడుతున్నారు.