దాదాపు 8 ఏళ్ల తర్వాత ధోనీ కెప్టెన్సీలో మళ్లీ క్రికెట్ ఆడటం తనకు సంతోషంగా ఉందని సీనియర్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ సారథితో కలిసి ఆడటం కన్నా ఇంకేం కావాలని తెలిపాడు. 2012లో చివరిసారి టీమ్‌ఇండియాకు ఆడిన అతడు.. తర్వాత దేశవాళీ, ఐపీఎల్ టోర్నీల్లో కొనసాగుతున్నాడు.
ధోనీకి నమ్మకం
ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న చావ్లాను.. ఈసారి వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అందుకు కారణం అతడిపై ధోనీకున్న నమ్మకమేనని తెలిసింది. దీంతో చావ్లా ఇప్పుడు సీఎస్కే తరఫున బరిలోకి దిగనున్నాడు. తాజాగా ఇదే విషయంపై ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన అతడు.. కెప్టెన్ తనపై నమ్మకం పెట్టుకున్నాక అంతకుమించి ఏం కావాలని అడిగాడు.
నా ఆటతీరు చూసే..
2007, 2011లో టీమ్‌ఇండియా ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో పీయూష్ కూడా ఒక ఆటగాడిగా ఉన్నాడు. దీంతో అతడు లక్కీ ఆటగాడనే ధోనీ తన జట్టులోకి తీసుకున్నాడా? అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని చెప్పాడు. ఆ రెండు ప్రపంచకప్ జట్లలో తనతో పాటు మరో 8 మంది ఉన్నారని, కాబట్టి తానొక్కడినే ఆ విజయాలు సాధించలేదని స్పష్టం చేశాడు. తాను ఎలా ఆడతాను, ఎంత కష్టపడుతున్నాననే విషయాల ఆధారంగానే తనని సీఎస్కే కొనుగోలు చేసిందని పేర్కొన్నాడు.ఈ క్రమంలోనే ధోనీతో మళ్లీ కలవడం సంతోషంగా ఉందన్నాడు.
తనకు ప్రపంచంలోనే అత్యుత్తమ సారథి దొరికాడని తెలిపాడు. అలాగే కోల్‌కతా జట్టులో మాజీ సారథి గౌతమ్ గంభీర్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని, ఇక్కడా ధోనీ అలాగే చేస్తాడని చెప్పాడు. టీమ్‌ఇండియాలో మహీ కెప్టెన్సీలో ఆడినందున అప్పుడూ బౌలర్లకు సహకరించేవాడని, అవసరమైతే తప్ప అతడు కలగజేసుకోడని వివరించాడు. కావాలనుకుంటే వికెట్ల వెనుక నుంచే సలహాలిస్తాడని పేర్కొన్నాడు. చెన్నై తరఫున నూరు శాతం మంచి ప్రదర్శన చేస్తానని పీయూష్ ధీమా వ్యక్తం చేశాడు.