హలో భారత క్రికెట్ అభిమానులారా..
ఎవరీ కొత్త అతిథి ఎప్పుడూ చూడలేదే అనిపిస్తోందా?
అవును.. నేను మీకు కొత్తే. నా పేరు గులాబి బంతి..!
ఆస్ట్రేలియాలో అడుగు పెట్టా.. బ్రహ్మరథం పట్టారు. యూఏఈలో అరంగేట్రం చేశా.. నాతో ఆట అదుర్స్ అన్నారు. ఇంకా ఎన్నో దేశాలు తిరిగా.. అడుగు పెట్టిన చోటల్లా నీరాజనమే..!
కానీ ఎన్ని దేశాలు తిరిగినా.. ఎంత పెద్ద స్టార్ల చేతుల్లో ఒదిగినా.. ఎందరికి వినోదాన్ని పంచినా.. క్రికెట్ రారాజుల ఇంట నా సందడి లేదన్న బాధ వెంటాడుతూనే ఉంది. ఇక ఎప్పటికీ భారత గడ్డలో అడుగు పెట్టలేనేమో అనుకుంటున్న వేళ 'దాదా' చొరవతో నా ఆశ ఫలిస్తోంది. ఈడెన్ గార్డెన్స్‌లో నా అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. ఈ చారిత్రక సందర్భాన నా కథను, నా ఉద్వేగాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం.. ముందుకెళ్లండి.
టీ20ల హవా పెరిగి టెస్టులకు ఆదరణ తగ్గిపోతుండటం వల్ల.. ఈ ఫార్మాట్‌కు ఆకర్షణ పెంచేందుకు ఐసీసీ డే/నైట్ టెస్టుల ఆలోచన చేసిన ఫలితాన నా పుట్టుకకు బీజం పడింది. 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య అడిలైడ్ టెస్టుతో నా అరంగేట్రం జరిగింది.
నేనే ఎందుకంటే..?
టెస్టులు డే/నైట్‌లో నిర్వహిస్తే బంతి రంగెందుకు మారాలి.. గులాబి బంతితోనే ఇవి ఎందుకు నిర్వహించాలి అనిపిస్తోందా? అదేంటో చెబుతా. పగటి పూట నిర్వహించే టెస్టు మ్యాచ్‌ల్లో ఎరుపు బంతి వాడతారు. అది చాలా మన్నికతో కూడింది. టెస్టుల్లో కొత్త బంతి ప్రభావం ఎక్కువ కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు బంతిని మార్చరు. 80 ఓవర్ల తర్వాతే కొత్త బంతి తీసుకుంటారు. వన్డేలు, టీ20ల్లో వాడే తెలుపు బంతి మన్నిక తక్కువ. 20-30 ఓవర్లకు మెరుపు పోయి నల్లగా అవుతుంది. బంతి కాస్త దెబ్బతిందనిపిస్తే అంపైర్లు మార్చేస్తారు. డే/నైట్ టెస్టుల్లో ఎరుపు బంతి వాడితే.. 30-40 ఓవర్ల తర్వాత మెరుపు పోయి నల్లగా మారుతుంది. ఫ్లడ్‌లైట్లలో సరిగా కనిపించదు. అలాగని పరిమిత ఓవర్ల క్రికెట్లో వాడే తెలుపు బంతి వాడితే 2-3 గంటలకు మించి మన్నిక కష్టం. టెస్టుల్లో అసాధారణ పరిస్థితుల్లో తప్ప 80 ఓవర్లలోపు బంతిని మార్చేందుకు వీలుండదు. ఈ కారణంగా పసుపు, నారింజ రంగు బంతులతోనూ ప్రయోగాలు చేసి చివరికి మన్నిక ఉంటూ, పగలైనా రాత్రయినా ఒకేలా కనిపించే నన్ను (గులాబి) డే/నైట్ టెస్టులకు ఎంచుకున్నారు.
నేను వాటిలా కాదు..
ఎరుపు, తెలుపు బంతుల్లాగే నాలోనూ కార్క్, రబ్బర్, ఉన్ని వాడతారు. సీమ్ వాటికి భిన్నంగా నలుపు రంగులో ఉంటుంది. ఆటలో నా తీరు వేరే బంతులతో పోలిస్తే భిన్నమే. తొలి 10-15 ఓవర్లలో బాగా స్వింగ్ అవుతా. అప్పుడు బౌలర్లకు పండగే. కానీ ఈ స్వింగ్ ప్రతాపం సీమ్ ఉన్నంత వరకే. అది పోయిందంటే..బ్యాట్స్‌మెన్‌కే అనుకూలం. నాతో రివర్స్ స్వింగ్ కష్టమే. నేనంటే స్పిన్నర్లకు పెద్దగా ఇష్టముండదు. పట్టు చిక్కట్లేదని తిట్టుకోవడం గమనించా.
ఎందుకింత ఆలస్యమంటే..
అంతర్జాతీయ క్రికెట్లో నాలుగేళ్ల కిందటే అరంగేట్రం చేసిన నేను.. ఇప్పటిదాకా కోహ్లీసేన ఆడే మ్యాచ్‌ల్లో కనిపించకపోవడానికి కారణాలున్నాయి. ఆస్ట్రేలియాలో కూకాబుర్రా, ఇంగ్లాండ్‌లో డ్యూక్ కంపెనీలు అక్కడి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని నన్ను వాళ్ల శైలిలో తయారు చేశాయి. అక్కడ ఎలాంటి ఫిర్యాదుల్లేవు. భారత్‌లో ఎస్జీ కంపెనీ సంస్థ ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు బంతి తయారు చేసింది. బీసీసీఐ దులీప్ ట్రోఫీలో పరీక్షించి చూసింది. విదేశాల్లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నేను బాగా స్వింగ్ అయ్యానని.. భారత్‌లో అలా జరగలేదని.. తొలి స్పెల్ తర్వాత బ్యాట్స్‌మెన్‌దే రాజ్యం అని.. పది ఓవర్లకే సీమ్ పోతోందని.. స్పిన్నర్లకు పట్టు చిక్కట్లేదని.. ఇలా ఎన్నో ఫిర్యాదులొచ్చాయి. ఫలితంగా టెస్టుల్లో నా వినియోగంపై బీసీసీఐ తటపటాయించింది. ఆటగాళ్లూ ఆసక్తి చూపించలేదు. పోయినేడాది ఆస్ట్రేలియాలో సిరీస్‌లో ఒక మ్యాచ్ డే/నైట్ అని ప్రతిపాదించడం వల్ల కోహ్లీసేన చేతుల్లోకి వెళ్లబోతున్నానని సంబరపడ్డా.. కానీ వాళ్లు కుదరదనేశారు. దులీప్ ట్రోఫీలోనూ ప్రయోగాలు ఆపేసినందున నా ఆశ తీరదనుకున్నా. కానీ నా పట్ల ప్రత్యేకమైన అభిమానమున్న గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడైన కారణంగా చకచకా డే/నైట్ టెస్టుకు రంగం సిద్ధం చేశాడు. చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో.. రేపే భారత్-బంగ్లా పోరుతో భారత గడ్డపై నా అరంగేట్రం. నాతో బోలెడన్ని అనుభూతుల్ని మూటగట్టుకోవడానికి స్టేడియంలో, టీవీల ముందు సిద్ధంగా ఉండండి.
నూటికి నూరు మార్కులు
నన్ను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో అది నూటికి నూరు శాతం నెరవేర్చా. నేనున్న ప్రతి మ్యాచూ సూపర్ హిట్టే. అన్ని దేశాల్లోనూ ప్రేక్షకులు స్టేడియాల్ని నింపేశారు. సాయంత్రం స్టేడియాలకు వచ్చి సేదదీరడం అభిమానులకు మహదానందమే. పైగా ఏమిటీ గులాబీ మహత్యం అంటూ నాపై ప్రత్యేక ఆసక్తితో ప్రేక్షకులు స్టేడియాలకు వచ్చారు. నేనున్నానంటే టెస్టులు.. బోర్ కొట్టించవు. డ్రాలతో విసుగెత్తించవ్! ఇప్పటిదాకా నేనున్న 11 మ్యాచ్‌ల్లోనూ ఫలితాలు రావడం, మ్యాచ్‌లు మూణ్నాలుగు రోజుల్లోనే ముగిసిపోవడం విశేషం.
ఇవీ చూడండి.. గులాబి గుట్టేంటి?