ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించాల్సిన ఆసియా కప్ టీ20 టోర్నీ ఆతిథ్య బాధ్యతల్ని వదులుకునేందుకు పాకిస్థాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ట్రోఫీ ఆవిష్కరణ సందర్భంగా ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహ్సాన్ మణి సూచనప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
"ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) సభ్య దేశాల ఆదాయాలకు ఆటంకం కలగకుండా చూడాలి. ఇది అందరి సభ్యులను ఉద్దేశించి చెప్పట్లేదు.. కొన్ని దేశాల గురించే చెబుతున్నాను."
-ఎహ్సాన్ మణి, పీసీబీ ఛైర్మన్
పాక్ ఆసియాకప్ వేడుకకు ఆతిథ్యమిస్తే.. భారత జట్టును అక్కడికి పంపించబోమని బీసీసీఐ గతంలోనే స్పష్టం చేసింది. అయితే, పాకిస్థాన్.. ఆసియా కప్‌ను నిర్వహించడం వల్ల తమకెలాంటి అభ్యంతరం లేదనీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అక్కడ నిర్వహించడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. తటస్థ వేదికపై నిర్వహించాలని తాము కోరుతున్నట్లు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీమిండియాను పాకిస్థాన్‌కు పంపే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ఒకవేళ టీమిండియా లేకుండా ఆసియా కప్‌ను నిర్వహించాలని ఏసీసీ భావిస్తే.. అది ఆసియా కప్ కాకుండా మరో టోర్నీ అవుతుందని.. భారత్ ఉండాలంటే మాత్రం పాకిస్థాన్ వేదిక కాకూడదని అధికారి తెలిపారు.