పాకిస్థాన్ ఆటగాళ్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు మరోసారి చర్యలు చేపట్టింది. కనీస స్థాయి ఫిట్‌నెస్ లేని ఆటగాళ్లకు జరిమానా విధిస్తామంటూ పీసీబీ ప్రకటించింది. ఆ మేరకు బోర్డు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిలో నాలుగో విడత ఫిట్‌నెస్ పరీక్షలను నేషనల్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో జనవరి 6,7 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ట్రైనర్ యాసిర్ మాలిక్ నేతృత్వంలో సాగే ఈ పరీక్షలో ఐదు విభాగాలుంటాయని వివరించింది. వీటిల్లో విఫలమైన ఆటగాళ్లు నెలవారీ పారితోషికంలో 15 శాతాన్ని అపరాధ రుసుముగా చెల్లించాలి. ఆ ఆటగాడు కనీస ఫిట్‌నెస్ స్థాయిని చేరుకునే వరకూ ఈ విధంగానే కొనసాగుతుంది. ఇక ఫిట్‌నెస్ పరీక్షల్లో వరుస వైఫల్యం ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీపై ప్రభావం చూపవచ్చు.
అసలు పాక్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై మొదటి నుంచి చాలా విమర్శలు ఉన్నాయి. 2019 ప్రపంచకప్ పోటీల్లో నాకౌట్ స్థాయిని కూడా దాటలేకపోయిన నేపథ్యంలో ఆటగాళ్లు తమ ఆహారంలో మార్పులు చేసుకోవాలని ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ సూచించాడు. ఆటగాళ్లకు బిర్యానీలు, అధిక నూనెతో చేసిన మాంసాహారం, స్వీట్లు ఇవ్వబోమని కూడా మిస్బా తెలిపాడు. పాక్ ఆటగాళ్లు వహాబ్ రియాజ్, మొహమ్మద్ అమీర్, షాదాబ్ ఖాన్లు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనున్నారు. వీరికి జనవరి 20,21లలో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తామని పీసీబీ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి.. 'భారత్-పాకిస్థాన్ మ్యాచ్ దాదాతోనే సాధ్యం'