రాజకీయ రంగప్రవేశంపై ఎటూ చెప్పలేనని అన్నాడు భారత క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. పశ్చిమ్‌బంగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన భాజపా తరఫున పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు దాదా.
"చూద్దాం.. పరిస్థితులు ఎలా నడిపిస్తాయో. ఎలాంటి అవకాశాలు వస్తాయో.. దాని బట్టి ముందుకు వెళదాం. నా జీవితం ఎన్నో ఆశ్చర్యకర మలుపులు తిరిగింది. తర్వాత ఏం జరగబోతుందో ఎప్పుడూ తెలిసేది కాదు. టీమ్ఇండియాకు కెప్టెన్, బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు తీసుకునే చివరి నిమిషం వరకు నాకు తెలియదు. అవకాశాలు వచ్చినప్పడు చాలా విషయాలతో ప్రభావితం అవుతాం. కుటుంబం, జీవనశైలి, పని, ఆరోగ్యం అన్నీ ప్రభావం చూపుతాయి. కాబట్టి జీవితం ఎటు తీసుకెళ్తుందో చూద్దాం."
- సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
అయితే తనకు లభిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపాడు గంగూలీ. తన పని తాను చేస్తున్నా అని, ప్రజలతో మమేకమై జీవించడమే తనకు తెలుసని అన్నాడు.
ఇదీ చూడండి: కోహ్లీసేనకు 'ధర్మ సంకటం'- రాహుల్‌కు చోటెక్కడ?