టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అండగా నిలిచాడు. అతడు పితృత్వపు సెలవులు తీసుకోవడం సరైందేనని పేర్కొన్నాడు. అతనో కుటుంబీకుడని తెలిపాడు. తన సతీమణి ప్రసవించినప్పుడు తానూ కొన్ని రంజీ మ్యాచులు ఆడలేదని వీవీఎస్ గుర్తు చేసుకున్నాడు.
కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. సతీమణి అనుష్కశర్మ జనవరిలో ప్రసవించే అవకాశం ఉండటం వల్ల చివరి మూడు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో స్టార్ ఆటగాడు కోహ్లీ ఆడితే బాగుండేదని కొందరు ఆసీస్ మాజీలు, బ్రాడ్‌కాస్టర్లు అంటున్నారు. అయితే సునీల్ గావస్కర్ సహా భారతీయులంతా విరాట్ నిర్ణయం సరైందేనని చెబుతున్నారు.
"విరాట్ నిర్ణయాన్ని మనం గౌరవించాలి. నిజమే, అతడు ప్రొఫెషనల్ క్రికెటర్. కానీ ఓ కుటుంబీకుడు కూడా. అందుకే కుటుంబానికి ఏది మంచో దానిని గౌరవించాలి. అదే పనిచేయాలి. అందుకే మనం అతడి నిర్ణయాన్ని గౌరవించాలి. ఎందుకంటే అతడి జీవితంలో ఇదో ముఖ్యమైన దశ"
- వీవీఎస్ లక్ష్మణ్, టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్
తన భార్య ప్రసవించినప్పుడూ కొన్ని క్రికెట్ మ్యాచులు ఆడలేదన్న సంగతిని ఈ హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్ గుర్తు చేసుకున్నాడు. "నా సతీమణి.. కుమార్తెను ప్రసవించినప్పుడు నేనూ కొన్ని రంజీ మ్యాచులు ఆడలేదు. ఆ విషయం నాకు గుర్తుంది. ఇదో ప్రత్యేకమైన అనుభూతి. అందులోనూ తొలి సంతానం ఎంతో ప్రత్యేకం" అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.