దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు పాకిస్థాన్ జట్టులో ఒక క్రికెటర్‌కు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ధ్రువీకరించింది.
కొద్దిరోజుల ముందే.. కరోనా కలకలంతో పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) వాయిదా పడింది. ఇప్పుడు.. దక్షిణాఫ్రికా పర్యటనపై సందిగ్ధం నెలకొంది.
"సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన 35 మంది పాక్ ఆటగాళ్లకు బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించాం. ఒక్కరు మినహా మిగతా క్రికెటర్లకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. కరోనా వచ్చిన ఆటగాడికి మరోమారు పరీక్ష నిర్వహిస్తాం. నెగెటివ్ వస్తే అతడు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తాడు. రెండో దఫా టెస్టుకు ముందు రెండ్రోజులు అతడు ఐసోలేషన్‌లో ఉంటాడు."
-పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.
మిగతా జట్టు సభ్యులు శిక్షణ నిమిత్తం లాహోర్‌లోని గడాఫీ స్టేడియానికి చేరుకుంటారని పాక్ బోర్డు వెల్లడించింది. అక్కడి నుంచి మార్చి 26న జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్తారని స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికాతో 4 టీ20లతో పాటు 3 వన్డేలు ఆడనుంది పాక్. అక్కడి నుంచి జింబాబ్వే టూర్‌కు వెళ్లనుంది. జింబాబ్వేతో 3 టీ20లతో పాటు 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
ఇదీ చదవండి: చివరి వన్డేలోనూ భారత మహిళల ఓటమి