టీమ్ఇండియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి.. తన ఉత్తమ ప్రదర్శనతో తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దేశవాళీలో ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ స్టార్ బ్యాట్స్‌మన్.. భారత జట్టు సాధించిన అనేక విజయాల్లో భాగమయ్యాడు. ఆటలో నిలకడతో అనతికాలంలో జట్టుకు వైస్ కెప్టెన్‌గా, కొన్ని మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు హిట్‌మ్యాన్. రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి నేటితో 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అతడి కెరీర్‌పై ఓ ప్రత్యేక కథనం.
ప్రపంచకప్‌తో ఎంట్రీ
రోహిత్ శర్మ.. 2007 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై జరిగిన లీగ్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కెరీర్ ప్రారంభంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా జట్టులో కొనసాగాడు. కానీ, మొదటి మ్యాచ్‌లో రోహిత్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. ఆ విజయంలో సౌరభ్ గంగూలీ, గౌతమ్ గంభీర్ కీలకపాత్ర పోషించారు.
టీ20 ప్రపంచకప్‌లో
ఆ తర్వాత 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ కోసం తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు రోహిత్ శర్మ. అందరూ యువకులనే ఎంపిక చేసిన ఈ జట్టుకు మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వం వహించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించడం సహా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు రోహిత్. మొదటి టీ20 ప్రపంచకప్‌ను భారత్ నెగ్గిన తర్వాత హిట్‌మ్యాన్‌కు జట్టులో అడే అవకాశాలు మరింత మెరుగయ్యాయి.
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ ప్రదర్శనకు గానూ.. 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన కామన్వెల్త్ టోర్నీకి సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఆసీస్‌తో జరిగిన మొదటి ఫైనల్లో సచిన్‌తో కలిసి రోహిత్ అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్నందించాడు. ఈ సిరీస్ తర్వాత రోహిత్ పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేక పోయాడు.
కెరీర్ మలుపు
మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ-2013లో బరిలోకి దిగింది టీమ్ఇండియా. ఈ సిరీస్ రోహిత్ శర్మ కెరీర్లో ఓ పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. ఈ టోర్నీ కోసం ధోనీ చేసిన మార్పుల్లో రోహిత్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. దక్షిణాఫ్రికాతో ఆడిన ప్రారంభ మ్యాచ్‌లో రోహిత్.. 81 బంతుల్లో 65 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 26 పరుగుల తేడాతో భారత్ నెగ్గింది. ఆ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 117 రన్స్ చేశాడు రోహిత్. ఫైనల్లో ఇంగ్లాండ్‌తో జరిగిన పోరులో టీమ్ఇండియా నెగ్గి.. రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీతో శిఖర్ ధావన్, రోహిత్ శర్మల ద్వయం విజయవంతమైన ఓపెనర్లుగా పేరు తెచ్చుకుంది.
'డబుల్'తో ప్రత్యర్థుల్లో 'గుబుల్'
ఆస్ట్రేలియాతో 2013లో జరిగిన ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు రోహిత్ శర్మ. కేవలం 158 బంతుల్లో 209 పరుగులు సాధించాడు. సచిన్, సెహ్వాగ్‌ల తర్వాత డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్‌గా రోహిత్ ఘనత వహించాడు. ఆ తర్వాత కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో ఏకంగా 264 పరుగులతో.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో 33 ఫోర్లు, 9 సిక్సర్లను బాదాడు రోహిత్.
2017లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో మూడోసారి డబుల్ సెంచరీ సాధించి.. తన భార్యకు పెళ్లిరోజు కానుకగా అందించాడు హిట్‌మ్యాన్.
గోల్డెన్ వరల్డ్‌కప్
రోహిత్ శర్మ.. అప్పటివరకు ఆడిన మ్యాచ్‌లు ఒక ఎత్తైతే, 2019లో జరిగిన ప్రపంచకప్ మరో ఎత్తు. ఒకే టోర్నీలో 5 శతకాలు చేసిన క్రికెటర్‌గా రోహిత్ ఘనత సాధించాడు. ఆ టోర్నీలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 648 పరుగులు చేశాడు. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో టీమ్ఇండియా ఓడి ఇంటిముఖం పట్టినా.. రోహిత్ ప్రదర్శనకు 'ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'గా గౌరవం దక్కింది.
ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌కు సారథ్యం వహిస్తోన్న రోహిత్.. జట్టుకు నాలుగు సార్లు ట్రోఫీని అందించడంలో కీలకపాత్ర పోషించాడు.
టెస్టు కెరీర్: అపరిమిత ఓవర్ల ఫార్మాట్లో 32 మ్యాచ్‌లు ఆడి 46.54 సగటుతో 2,141 పరుగులు చేశాడు.
వన్డే కెరీర్: భారత్ తరపున 224 మ్యాచ్‌లు ఆడి 9,115 పరుగులు సాధించాడు. వీటిలో 29 సెంచరీలు, 43 అర్ధ శతకాలు ఉన్నాయి.
టీ20 కెరీర్: ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 108 మ్యాచ్‌ల్లో 2,773 పరుగులు చేశాడు.