భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్ మరో క్రీడకు లేదన్నది ఎవరూ కాదనలేని సత్యం. క్రికెట్ వస్తుందంటే పనులు పక్కన పెట్టి మరి చూస్తారు చాలామంది. అయితే క్రికెట్ వేడుకల కంటే ఒలింపిక్స్, కామన్వెల్త్ టోర్నీలు భారీగా నిర్వహిస్తారని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అయితే వ్యక్తిగత గుర్తింపు క్రికెటర్లకు వచ్చినట్లు మిగతా క్రీడాకారులకు రావడం లేదన్నాడు.
"క్రికెట్ వేడుకల కంటే ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల కార్యక్రమాలు భారీగా నిర్వహిస్తారు. అథ్లెట్లకు మంచి సదుపాయాలుంటాయని, వారికి సరైన పౌష్టికాహారం, నైపుణ్యంగల శిక్షకులు ఉంటారని అనుకునేవాడిని. కానీ వారిని (ఇతర క్రీడాకారులు) కలిసి మాట్లాడినపుడు ఇవేమి అందడం లేదని తెలిసింది. దేశానికి పతకాలు తీసుకొస్తున్నప్పటికీ మేము (క్రికెటర్లు) అందుకునే సౌకర్యాల్లో 10 శాతం కూడా వాళ్లు అనుభవించట్లేదు. వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది" -వీరేంద్ర సెహ్వాగ్, మాజీ భారత క్రికెటర్
ముంబయిలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్ క్రికెట్ కోచ్‌లకూ సరైన గుర్తింపు అందడం లేదని తెలిపాడు.
"క్రికెటర్ల కెరీర్లో కోచ్‌లు ముఖ్య పాత్ర పోషిస్తారు. కానీ వారికీ సరైన గుర్తింపు దక్కడం లేదు. జాతీయ జట్టులో ఎంపికైన తర్వాత చాలా మంది క్రికెటర్లు తమ కోచ్‌లను మర్చిపోతున్నారు. ఎందుకంటే వారిని కలిసి మాట్లాడే అవకాశం వారికి ఉండదు. కానీ ఇతర క్రీడల్లో ఆరంభం నుంచి అంతం వరకు కోచ్‌ల అవసరం ఉంది. వాళ్లు ఎక్కువ సమయం క్రీడాకారుల కోసమే ఖర్చుపెడతారు" -వీరేంద్ర సెహ్వాగ్
1999 నుంచి 2013 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించాడు సెహ్వాగ్. 104 టెస్టులు, 251 వన్డేలు ఆడాడు.
ఇది చదవండి: 'హాకీ దిగ్గజానికి భారతరత్న ఎప్పుడిస్తారో'